Clock Of Nellore ( Nellore ) – కొడితే కొట్టాలిరా… సిక్స్ కొట్టాలి… ఆడితే ఆడాలిరా… రఫ్ఫాడాలి… బాటేదైనా కానీ… మునుముందుకెళ్లాలీ… పోటీ ఉన్నా కానీ… గెలుపొంది తీరాలీ… చరిత్రలో నీకో పేజీ ఉండి తీరాలీ… ఇదీ మెగాస్టార్ చిరంజీవి నటింటిన ఠాగూర్ సినిమాలోని పాట. సినిమా సంగతి ఏమో గానీ ఈ పాట అక్షరాలా… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సరిపోయేలా ఉందనడంలో సందేహం లేదు. అవును ఉమ్మడి నెల్లూరుజిల్లా చరిత్రలో ఆయనో పేజీని సృష్ఠించుకున్నారు. ఒకే నియోజకవర్గం నుండి మధ్యలో విరామం లేకుండా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడో వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఈ ఎన్నికలకు ముందు ఆ చరిత్ర ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని కలికి యానాది రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికే ఉంది. తాజా ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వరసగా మూడో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి సరసన చేరారు. కావలి నియోజకవర్గం నుండి వరుసగా మూడు దఫాలు కలికి యానాది రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.1985, 1989,1994లో వరుసగా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అలాగే కోవూరు నియోజకవర్గం నుండి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా వరుసగా మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983, 1985, 1989లో వరుసగా శ్రీనివాసులు రెడ్డి కోవూరు నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పటి వరకూ ఉమ్మడి నెల్లూరుజిల్లాలో ఒకే నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డు కలికి యానాది రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికే ఉంది. అయితే చాలా ఏళ్ల తరువాత ఆ అవకాశం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి దక్కింది. జిల్లాలో ఎన్నో పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు ఉన్నా వారికి ఆ అవకాశం దక్కలేదు. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి, విద్యార్ధి నేతగా ఎదిగి, ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా అంటే 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. శుక్రవారం ఆయన ఏపి అసెంబ్లీలో ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అభినందించారు.
