Clock Of Nellore ( Nellore ) – సీనియర్ వైసీపి నేత, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కో – ఆప్షన్ సభ్యులు నూనె మల్లిఖార్జున యాదవ్ శనివారం జనసేన పార్టీలో చేరారు. చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో బస చేసి ఉన్న పవన్ కళ్యాణ్ ను మల్లిఖార్జున్ యాదవ్ కలవగా, ఆయనకు కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ పటిష్ఠత కోసం నేతలతో కలిసి పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. 2014కు ముందు వరకూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన నూనె మల్లిఖార్జున యాదవ్… అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధిగా తన పేరును ప్రకటించాలని టిడిపిపై ఒత్తిడి తెచ్చారు. అయితే మేయర్ అభ్యర్ధిత్వం ఆయనకు కాకుండా డాక్టర్ జెడ్. శివ ప్రసాద్ కు దక్కడంతో అలక బూనిన మల్లిఖార్జున యాదవ్ టిడిపికి రాజీనామా చేసి, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం వైసీపి ఆయనకు కార్పొరేషన్ కో – ఆప్షన్ సభ్యునిగా అవకాశం కల్పించింది. అనీల్ కుమార్ యాదవ్ నరసరావు పేట ఎంపి అభ్యర్ధిగా వెళ్లడం, మారిన రాజకీయ సమీకరణల నేపద్యంలో మల్లిఖార్జున యాదవ్ ఇవాళ వైసీపిని వీడి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని మల్లిఖార్జున యాదవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.