Clock Of Nellore ( Buchi ) – రెడ్డిపాలెంలో ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపుతామని కోవూరు నియోజకవర్గ ఎన్‌డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని రెడ్డిపాలెంలో ఆమె శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన ప్రశాంతిరెడ్డికి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ.. సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రెడ్డిపాలెం గ్రామంలో భూగర్భ జలాలు ఫ్లోరైడ్ తో నిండి ఉన్నాయని, ఈ సమస్యని అధిగమించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. తాను గెలిచిన వెంటనే ఈ గ్రామంలోని ప్రతి ఇంటికి శుద్ధమైన నీటిని కుళాయి కనెక్షన్ ద్వారా అందిస్తానని హామీ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం చేపట్టిన భూసర్వే ద్వారా గ్రామాల్లోని రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఒక రైతుకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే ఆన్లైన్లో ఒక ఎకరం, రెండు ఎకరాలు ఇలా తక్కువగా చూపిస్తోందని, ఇదెక్కడి విడ్డూరమని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్యలు లేకుండా దీన్ని సరిచేస్తామని అన్నారు. గ్రామంలోని 45 ఎకరాల తిప్పను వైసిపి నేతలు ఆక్రమించారని ఆరోపించారు. గ్రామంలోని వీధుల్లో సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు గాని ఎలాంటి అభివృద్ధి జరగ లేదని అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హిందూ స్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
