
Clock Of Nellore ( Kovur ) – జిల్లాలో సంచలనం నమోదైంది. వాలంటీర్లు కూడా తెలుగుదేశం పార్టీకి జై కొట్టడం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోవూరు నియోజకవర్గానికి చెందిన దాదాపు 40 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఐదు వేల జీతంలో బండి నెట్టుకొస్తున్న వాలంటీర్లు.. నారా చంద్రబాబు నాయుడుగారి నాయకత్వంలో, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో పనిచేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి వేమిరెడ్డి దంపతులు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి టీడీపీలో చేరడం రాష్ట్రంలోనే తొలిసారని అన్నారు. ఇంకా అనేకమంది వాలంటీర్లు విముక్తి కోసం వేచి ఉన్నారని, వారంతా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లతో వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారన్నారు. కానీ వీరు స్వచ్చందంగా వచ్చి టీడీపీలో చేరారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే వాలంటీర్లకు 10 వేల జీతం ఇస్తారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు.