రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉమ్మడి పోటీ : హమాలీల ఆత్మీయ సమావేశంలో నారాయణ

Clock Of Nellore ( Nellore ) – ఆంధ్ర రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, ప్ర‌జ‌ల సంక్షేమం దృష్ఠ్యా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు ఉమ్మ‌డి కూట‌మిగా రానున్న ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ట్లు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట‌లోని ఓ క‌ళ్యాణ‌మండ‌పంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు ఏర్పాటు చేసిన హ‌మాలీలు, నాయ‌కులు, కార్మికుల ఆత్మీయ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌తో పాటు డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్‌ యాద‌వ్‌, నారాయ‌ణ విద్యాసంస్థ‌ల జీఎం విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డిలు హాజ‌ర‌య్యారు. ఆత్మీయ స‌మావేశానికి విచ్చేసిన నారాయ‌ణ‌కు బీజేపీ నాయ‌కులు, హ‌మాలీల నాయ‌కులు, కార్మికులు ఘ‌నంగా స‌త్క‌రించారు. పూల‌మాల‌లు, శాలువాల‌తో స‌న్మానించారు.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మాట్లాడుతూ నెల్లూరు బీజేపీ కార్యాల‌యంలో హ‌మాలీలు ఆత్మీయ స‌మావేశం ఏర్పాటు చాలా ఆనందంగా ఉంద‌న్నారు. టీడీపీ ప్ర‌భుత్వంలో హ‌మాలీల సంక్షేమం కోసం ఎంతో చేశామ‌ని చెప్పారు. రానున్న టీడీపీ ప్ర‌భుత్వంలో త‌గిన ప్రాధాన్య‌త ఇస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. అదేవిధంగా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ఉమ్మ‌డిగా పోటీ చేస్తుండ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు ఎన్‌డీఏ భాగ‌స్వామ్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి ప‌థ‌కాల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగిందని తెలిపారు. నెల్లూరులో చేప‌ట్టిన అండ‌ర్‌గ్రౌండ్‌ డ్రైనేజి, తాగునీటి ప‌థ‌కానికి రూ.1100 కోట్ల నిధుల‌ను హ‌డ్కో ద్వారా చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ఇందుకు కేంద్ర‌ ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంద‌ని తెలిపారు. ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ఎన్‌డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని తెలిపారు. అయితే అప్ప‌ట్లో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌తంలో ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని దుష్ప్ర‌చారం చేశార‌న్నారు. అనంత‌రం గెలిచిన వారు ఆ విష‌యాన్ని మ‌ర‌చిపోవ‌డం దౌర్భాగ్య‌మ‌ని తెలిపారు. కానీ ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం మ‌ళ్లీ ఎన్‌డీఏతో మ‌ళ్లీ క‌లిసి రానున్న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాక్ష‌స ప‌రిపాల‌న సాగుతుంద‌ని నారాయ‌ణ మండిప‌డ్డారు. మాట్లాడితే అక్ర‌మ కేసులు పెట్ట‌డ‌మో, జైలుకు పంప‌డ‌మో చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ప్ర‌పంచంలోనే ప్ర‌జాస్వామ్యం క‌లిగినది భార‌త‌దేశంలో అయితే… మ‌న రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం లేకుండాపోయింద‌న్నారు. యువ‌త భ‌విష్య‌త్ కోసం రాష్ట్రం డెవ‌ల‌ప్‌మెంట్ కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని తెలిపారు. ప్ర‌ధాన మోదీ భార‌త‌దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశార‌ని కొనియాడారు. ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తేనే యువ‌త‌కు ఉపాధి క‌లుగుతుంద‌ని చెప్పారు. అయితే నియంతృత్వ‌పాల‌న సాగిస్తున్న జ‌గ‌న్ వైఖ‌రికి ప‌రిశ్ర‌మ‌లు వేరే రాష్ట్రాల‌కు వెళ్లిపోతున్నాయ‌ని మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్‌మెంట్ చేసి ఆదాయాన్ని తీసుకోవాల్సింది పోయి అప్పుల‌పాలు చేశార‌ని ఆగ్ర‌హించారు. అంద‌రికీ అనుకూలంగా ఉంటుంద‌ని సౌల‌భ్యంగా ఉండే ప్రాంతంలోనే రాజ‌ధాని నిర్మాణం చేప‌డితే… అవ‌గాహ‌న లేని వైసీపీ ప్ర‌భుత్వం దాన్ని పూర్తిగా మ‌రుగున‌ప‌డేసింద‌న్నారు. కేవ‌లం డెవ‌ల‌ప్‌మెంటే టీడీపీ ల‌క్ష్యంగా ముందుకెళుతున్నామ‌ని చెప్పారు. నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చిన తాను ఇంత‌స్థాయి ఎదిగానంటే అది కేవ‌లం చ‌దువుకోవ‌డం వ‌ల్ల‌నేన‌ని, ఆ దిశ‌గా యువ‌త కూడా చ‌దువుకుని ఉన్న‌త స్థితికి ఎద‌గాల‌ని కోరారు. రానున్న ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా త‌న‌ను, ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని గెలిపిస్తే… ఇటు రాష్ట్ర‌, అటు కేంద్ర నిధుల‌తో నెల్లూరుతో పాటు రాష్ట్రాన్ని ఎంతో డెవ‌ల‌ప్‌మెంట్ చేసుకోవ‌చ్చ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. నెల్లూరును మోడ‌ల్‌సిటీగా మార్చే బాధ్య‌త తాము తీసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఆ మేర‌కు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నారాయ‌ణ కోరారు.

Read Previous

కోవూరులో అవినీతి రహిత పాలన అందిస్తాం : విపిఆర్ దంపతులు

Read Next

వైసిపి ప్రభుత్వంతోనే అభివృద్ధి : కందుకూరులో విజయసాయిరెడ్డి ప్రచారం

Leave a Reply

Your email address will not be published.