Clock Of Nellore ( Nellore ) – నారాయణ విద్యా సంస్థలు, దానికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లపై ఇవాళ పోలీసులు నిర్వహించిన సోదాలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బరితెగించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోమవారం రాత్రి నెల్లూరులోని వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అనేక మంది తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని అన్నారు. టిడిపి – జనసేన ఉమ్మడి సభలకు కూడా జనం భారీగా తరలివస్తున్నారని, ఈ క్రమంలో ప్రభుత్వం టిడిపిని ఇబ్బంది పెట్టేందుకు పోలీసులను వాడుకుంటుందని ఆరోపించారు. ఇవాళ ప్రభుత్వం బరితెగించి ప్రవర్తించిందని, మాజీ మంత్రి నారాయణను వేధింపులకు గురిచేస్తుందన్నారు. గడచిన ఐదేళ్లలో నారాయణపై రాష్ట్రంలోని అనేక పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారన్నారు. ఇటీవలే నకిలీ మందుల పేరుతో నారాయణ మెడికల్ కళాశాలలో విధ్వంసం సృష్ఠించారని ధ్వజమెత్తారు. ఇవాళ పోలీసులు నారాయణ అనుచరులు, వ్యాపారస్తులపై తనిఖీల పేరుతో దాడులు నిర్వహించి భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. నారాయణ రహస్యాలు చెప్పాలంటూ పోలీసులు బెదిరించారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఇంటిలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు, సిఐడి చీఫ్ రఘరామిరెడ్డిలు వైసీపి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, పోలీసు శాఖలో 90 శాతం మంది నిజాయితీగా ఉన్నారని, మిగిలిన 10 శాతం మందే వైసీపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో కూడా ఇద్దరు పోలీసు అధికారులు వైసీపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, వారి వ్యవహారాలను ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్ఠి సారించాలని, ఇవాళ జరిగిన ఘటనపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఎవరు ఎన్ని చేసినా త్వరలో జరిగే ఎన్నికల్లో 160 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలను టిడిపి – జనసేన కూటమి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నాారాయణను భయపెట్టాలనుకుంటే ప్రజలు ఇంకా రెచ్చిపోతారని హెచ్చరించారు. వాహనాల కొనుగోలు విషయంలో అభ్యంతరాలు ఉంటే రవాణా శాఖ నోటీసులు ఇవ్వాలే తప్పా పోలీసులతో తనిఖీలు ఏంటని ప్రశ్నించారు. సంబంధం లేని వ్యక్తుల ఇళ్లలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించి భయబ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. విద్యా సంస్థలకు వాహనాలు ఇవ్వాలంటే సొసైటీ పేరుతోనే రిజిస్ట్రేషన్లు చేయాలని గుర్తు చేశారు. రవాణా శాఖకు ఏమైనా చెల్లింపులు చేయాలంటే చేస్తాం కదా అని విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. కేవలం నారాయణ మీద కక్ష సాధింపుల చర్యల్లో భాగంగా పోలీసులు సోదాలు నిర్వహించారని అంటూ ఎవరెన్ని చేసినా నెల్లూరు సిటీలో నారాయణ గెలుపును ఎవ్వరూ ఆపలేరని విజయభాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.
