Clock Of Nellore ( Nellore ) – ఇచ్చిన మాట తప్పడం తన జీవితంలో ఇప్పటి వరకూ లేదని, త్వరలో జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేసి నంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని రూరల్ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన 32వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ తాళ్లూరి అవినాష్ ఆధ్వర్యంలో పార్కు సెంటర్ నుండి ఇంటింటికి వెళ్తూ ఆదాల ప్రచారం నిర్వహించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వైసీపిలో చేరగా, వారందరికీ కండువాలు వేసి ఆదాల పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను రూరల్ ఇంఛార్జ్ గా వచ్చిన గడచిన ఆరు నెలల కాలంలోనే నియోజకవర్గంలో 150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో తనను దీవిస్తే రానున్న ఐదేళ్లలో వెయ్యి కోట్లతో పనులు చేపట్టి నియోజకవర్గాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని విస్మరించడం తన జీవితంలో లేదని ఆదాల స్పష్టం చేశారు. ఇదే తన చివరి ఎన్నిక అని 2029 ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో విజయడైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, స్వర్ణా వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
