ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 మంది అభ్యర్ధులను ప్రకటించిన టిడిపి

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం – జనసేన కూటమి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లకు గానూ 118 సీట్లలో అభ్యర్ధులను ఖరారు చేసింది. 118 సీట్లలో 94 మంది టిడిపి అభ్యర్ధులు కాగా, 24 మంది జనసేన పార్టీ అభ్యర్ధులు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు 94 మంది అభ్యర్ధులను ప్రకటించగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు కేటాయించిన 24 సీట్లలో 5 మంది పేర్లను మాత్రమే ప్రకటించి, మిగతా జాబితా రెండు రోజుల్లో విడుదల చేస్తానని ఇవాళ వెల్లడించారు. ఇక ఉమ్మడి నెల్లూరుజిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వాటిల్లో 6 మంది అభ్యర్ధులను టిడిపి ప్రకటించింది. ముందు నుంచి అనుకున్న విధంగానే నెల్లూరు సిటీ అభ్యర్ధిగా నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఖరారు చేశారు. నెల్లూరు రూరల్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరును ప్రకటించారు. గూడూరు నియోజకవర్గం నుండి అందరూ ఊహించినట్లుగానే మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పేరును చంద్రబాబు ప్రకటించారు. సూళ్లూరుపేట స్థానంకు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం కుమార్తె విజయశ్రీను ఎంపిక చేసి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎంపిక చేశారు. ఇక ఉదయగిరి స్థానంలో కొత్త అభ్యర్ధికి అవకాశం ఇచ్చారు. గత ఏడాదిగా వివిధ సేవా కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజలకు చేరువైన ఎన్.ఆర్.ఐ కాకార్ల సురేష్ ను ఖరారు చేశారు. కావలి నియోజకవర్గానికి కావ్య కృష్ణారెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు. ఇక మిగిలిన ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఆత్మకూరు నుండి ఆనం రామనారాయణరెడ్డి, కోవూరు నుండి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, వెంకటగిరి నుండి కురుగొండ్ల రామకృష్ణ, సర్వేపల్లి నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా వాటిల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మార్పు లేకపోయి ఉన్నట్లయితే ఆయా స్థానాల అభ్యర్ధులను కూడా ఇవాళే ప్రకటించే వారు. మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టే ప్రకటించలేదు.

Read Previous

వేమిరెడ్డితో టిడిపి అగ్రనేతల భేటీ : తెలుగుదేశంలో చేరేందుకు విపిఆర్ అంగీకారం

Read Next

నెల్లూరుజిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం : నెల్లూరుసిటీ టిడిపి అభ్యర్ధి నారాయణ వెల్లడి

Leave a Reply

Your email address will not be published.