Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆపార్టీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అంగీకరించినట్లు తెలిసింది. ఇవాళ టిడిపి నేతల బృందం నెల్లూరులోని వేమిరెడ్డి నివాసానానికి వెళ్లింది. బృందంలోని నేతలు ఆయనతో సుమారు 3 గంటల పాటూ చర్చలు జరిపారు. మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ, తాళ్లపాక రమేష్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కందుకూరు టిడిపి ఇంఛార్జ్ ఇంటూరు నాగేశ్వర రావు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాలేపాటి సుబ్బానాయుడు తదితరులు వేమిరెడ్డితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. వేమిరెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అక్కడి నుండే నేతలు చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. అంతా సాఫీగా చర్చలు ముగిశాయి. చర్చల అనంతరం మాజీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యామని, తెలుగుదేశంలోకి ఆహ్వానించగా ఆయన అంగీకరించారన్నారు. త్వరలో వేమిరెడ్డి టిడిపిలో చేరతారని నాారాయణ చెప్పారు.

