Clock Of Nellore ( Muthukuru ) – అదానీ కృష్ణపట్నం పోర్టులోని కంటెనైర్ టెర్మినల్ ను చెన్నైకు తరలిస్తే స్థానికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కంటైనర్ టెర్మినల్ ను కృష్ణపట్నం పోర్టులోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షాల పార్టీలతో కలిసి ఆయన పోర్టు సిఈఓను కలిశారు. టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టిడిపి నేత మాలేపాటి సుబ్బానాయుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి, బిజేపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, సిపిఎం, సిపిఐ పార్టీల నేతలు గురువారం పోర్టు వద్దకు చేరుకున్నారు. అక్కడే పోర్టు తరలింపుకు నిరసనగా ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం తెలియజేశారు. అనంతరం పోర్టు సిఈఓ జి.జే. రావును కలిసి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోను కంటైనర్ టెర్మినల్ ను తరలించవద్దని విజ్ఞప్తి చేశారు. కంటైనర్ టెర్మినల్ లేకుంటే పోర్టులో ఇక ఎగుమతులు, దిగుమతులే ఉండవని, తర్వాత పోర్టు మూత పడటం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. టెర్మినల్ ను తరలిస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
