Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని జాతీయ రహదారిపై టోల్ ప్లాజా పనులు ప్రారంభమయ్యి 10 రోజులు గడుస్తున్నా మొదటే కాకుండా ఇప్పుడే ఎందుకు పోరాటం మొదలు పెట్టారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించారు… వైసీపి నెల్లూరు రూరల్ అధికార ప్రతినిధి జివి ప్రసాద్. టోల్ ప్లాజా నిర్మిస్తున్న విజయలక్ష్మి కనస్ట్రక్షన్స్ యాజమాన్యంతో చర్చలు విఫలమయ్యాయా అని విమర్శించారు. ఇది తాను అంటున్న మాట కాదని, నెల్లూరు ప్రజలు అంటున్న మాట అని పేర్కొన్నారు. సోమవారం నెల్లూరులోని వైసీపి జిల్లా కార్యాలయంలో జివి ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. టోల్ ప్లాజా నిర్మాణం కోసం మే నెలలో ఆదేశాలు రాగా అప్పుడే ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఢిల్లీలోని పెద్దలతో మాట్లాడి దాన్ని నిలుపుదల చేయించారని, అయితే తాజాగా మళ్లీ 10 రోజుల క్రితం పనులు ఎవ్వరికీ తెలియకుండా విజయలక్ష్మి కనస్ట్రక్షన్స్ వారు మొదలు పెట్టారన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి… విజయలక్ష్మి కనస్ట్రక్షన్స్ వారితో మాట్లాడి పనులు ఆపించారన్నారు. టోల్ ప్లాజా వల్ల ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకే కాదని, నెల్లూరు సిటీ, కోవూరు, సర్వేపల్లి తదితర నియోజకవర్గ ప్రజలందరికీ ఇబ్బందేనని, త్వరలో ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి అందరు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యి టోల్ ప్లాజా నిర్మాణ పనులు మరో సారి ప్రారంభం కాకుండా చర్యలు తీసుకోబోతున్నారని జివి ప్రసాద్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలియజేశారు.