Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. త్వరలో టిడిపి తీర్ధం పుచ్చుకోనున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( MLA Kotam Reddy ) రాకను తీవ్రంగా వ్యతిరేకించిన టిడిపి జిల్లా అధ్యక్షులు, రూరల్ టిడిపి ఇంఛార్జ్ అబ్ధుల్ అజీజ్… అధిష్ఠానం ఆదేశంతో మనసు మార్చుకున్నట్లు అర్ధమవుతుంది. అజీజ్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు చిన్నపాటి ఆపరేషన్ చేయడంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దాదాపు 10 రోజుల నుండి అజీజ్ ఇంట్లోనే ఉన్నారు. శనివారం టిడిపి ప్రతినిధుల బృందం ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిసిన తర్వాత అజీజ్ ను కూడా కలిసి మాట్లాడారు. అనంతరం ఇవాళ ఎమ్మెల్యే కోటంరెడ్డి హరనాథపురంలోని అజీజ్ నివాసానికి వెళ్లారు. ఆయన్ను పరామర్శించడంతో పాటూ రాజకీయ అంశాలపై చర్చించారు. త్వరగా కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోటంరెడ్డి ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి… అజీజ్ ను కలవడంతో నెల్లూరు రూరల్ టిడిపిలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు చక్కబడ్డట్లు అనుకోవాల్సి ఉంది.