Clock Of Nellore ( Amaravathi ) – తీవ్ర ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపి ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ( Monsoon )ప్రవేశించాయి. ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట, సమీప ప్రాంతాల్లో నైరుతి పవనాలు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి పవనాలు విస్తరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. రాగల 24 గంటల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి నైరుతి రుతుపవనాలు. వీటి ప్రభావంతో పలుచోట్ల జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈసారి.. భారత్లోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం కాస్త ఆలస్యం అయ్యింది. జూన్ 8 నాటికి అవి కేరళ తీరాన్ని తాకాయి. గతేడాది మే 29 నాటికే అవి కేరళ తీరానికి చేరుకున్నాయి. 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న ప్రవేశించాయి. భారత్లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఏప్రిల్ నెలలో ప్రకటించింది. అయితే.. భారత్లో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్లనే కురుస్తుంది. దేశ వ్యవసాయ రంగానికి రుతుపవనాలే కీలకం. మొత్తం సాగు విస్తీర్ణంలో 52 శాతం మాన్సూన్పైనే ఆధారపడి ఉంటుంది. ఇది దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం వాటా. తద్వారా దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన సహకారం లభిస్తుంది.