Clock Of Nellore ( Nellore ) – అర్హులైన ఏ ఒక్కరు పింఛన్ రాకుండా మిగిలిపోరాదని వారి అభ్యర్థనలను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనవరి 5వ తేదీలోగా నివేదికలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మనాద్, డిఆర్ఓ వెంకట నారాయణమ్మలతో కలిసి వై యస్ ఆర్ పింఛన్ కానుక, నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు, మాండూస్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటల అంచనాలు తయారీ, విత్తనాల పంపిణీ, వైయస్సార్ గ్రామ ఆరోగ్య కేంద్రాలు, స్పందన అర్జీల పరిష్కారం, కోర్టు కేసుల పరిష్కారం తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతినెల మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 80 కోట్ల రూపాయల మేరకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దాదాపు 12 వేల మంది పింఛను దారులను అనర్హులుగా గుర్తించడం జరిగిందని, వారందరికీ తప్పనిసరిగా నోటీసులు వెంటనే జారీ చేయాలన్నారు. వారి నుండి అభ్యర్థనలను సరైన ఆధారాలతో స్వీకరించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వాటిని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనవరి నెల 5వ తేదీలోగా సంబంధిత నివేదికలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. వారి అభ్యర్థనలను సచివాలయ సిబ్బందితో సహా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిశీలించాలని సూచించారు. ఈ విషయమై ప్రతిరోజు మండల ప్రత్యేక అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో పర్యవేక్షించి రోజువారి నివేదికలు అందజేయాలన్నారు. అర్హులైన ఏ ఒక్క పింఛనుదారు కూడా పింఛన్ రాకుండా తప్పిపోరాదని, అనర్హులు ఏ ఒక్కరు కూడా పింఛను పొందరాదని స్పష్టం చేశారు.

వైయస్సార్ జగనన్న కాలనీల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, నిర్ణీత లక్ష్యం మేరకు మరింత పురోగతి సాధించాలన్నారు. పిఎం ఏ వై గ్రామీణ్ అన్ని యూనిట్లు ప్రారంభం కావాలన్నారు. ఇకపై బిబిఎల్ స్థాయిలో ఉన్న అన్ని ఇల్లు నిర్మాణం బిఎల్ స్థాయికి చేరుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న లబ్ధిదారులందరికీ 35 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి త్వరగా గృహ నిర్మాణం పూర్తయ్యలా పర్యవేక్షించాలన్నారు. మాండోస్ తుఫాను వలన దెబ్బతిన్న పంటల అంచనాలను పక్కాగా తయారు చేయాలని అన్ని సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచాలని సామాజిక తనిఖీ సజావుగా జరిగేలా చూడాలన్నారు. నిజంగా దెబ్బతిన్న పంటల నివేదికను రూపొందించాలని ఫిర్యాదులకు తావు లేకుండా అర్హులైన ఏ ఒక్క రైతు లబ్ధి పొందకుండా తప్పిపోరాదని సూచించారు. అర్హులైన రైతులందరూ 80 శాతం సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. పంటల వారీగా ఇన్పుట్ సబ్సిడీ పొందే రైతుల జాబితా సజావుగా సిద్ధం చేయాలన్నారు. వైయస్సార్ గ్రామ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కోసం 2.5 కోట్ల రూపాయలను పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేయడం జరిగిందని వెంటనే అన్ని చోట్ల నిర్మాణం పనులు మొదలు పెట్టాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు వ్యక్తిగతంగా సందర్శించి వాటి నివేదికలను అందజేయాలన్నారు. స్పందన అర్జీల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోనే అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. కోర్టు కేసులు ధిక్కరణకు గురి కాకుండా చూడాలని, కలెక్టరేట్లోని న్యాయవిభాగంతో సమన్వయం చేసుకొని కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. సంబంధిత అధికారులను పిలిపించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ బాపిరెడ్డి, టిజిపి ప్రత్యేక కలెక్టర్ సుధాకర్, డి ఆర్ డి ఏ, డ్వామా, హౌసింగ్, ఏపీఎంఐపి పిడిలు సాంబశివారెడ్డి, వెంకటరావు, నాగరాజు, శ్రీనివాసులు, డిటిసి చందర్, డిఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, జలవనరులు, విద్యుత్ శాఖల ఎస్ ఈలు రంగవరప్రసాద్, అశోక్ కుమార్, కృష్ణమోహన్, వెంకటసుబ్బయ్య, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో చిరంజీవి, వ్యవసాయ శాఖ జెడి సుధాకర్ రాజు, బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య, డీఈవో సుబ్బారావు, ఏపీ ఎస్ ఎమ్ ఐ డి సి ఈ ఈ విజయ భాస్కర్, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, ఎల్ డి ఎం శ్రీకాంత్ ప్రదీప్ కుమార్, జిల్లా ఉద్యాన అధికారి సుబ్బారెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.