Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధికి గతంలో ఎవ్వరూ చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని నెల్లూరు నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. ఆమె ప్రాతినిద్యం వహిస్తున్న 12వ డివిజన్ పరిధిలోని వావిలేటిపాడు ముస్లింపాళెంలో 28 లక్షలతో నిర్మించే ఉర్ధూ పాఠశాల నిర్మాణ పనులకు మేయర్ సోమవారం శంఖు స్థాపన చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ఉర్దూ పాఠశాల నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. పాఠశాలలో అన్ని మౌలిక వసతులను కల్పించి, నిర్మాణాన్ని అంత్యంత నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ సూచించారు. ఉర్దూ పాఠశాల నిర్మాణంతో స్థానికంగా ఉన్న నిరుపేద ముస్లిం బాల బాలికలకు సాంప్రదాయ ఉర్దూ భాషలో ప్రావీణ్యంతో పాటు ఉన్నత విద్యకు అవసరమైన అవకాశాలు కల్పించనున్నామని మేయర్ తెలిపారు. మైనారిటీ విద్యార్ధుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచలతో, రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వై.సి.పి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల సహకారంతో నిర్మిస్తున్న ఉర్దూ పాఠశాలతో ముస్లిం బాలబాలికలు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని మేయర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక వై.సి.పి మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
