Clock Of Nellore ( Nellore ) – శాశ్వత భూహక్కు పత్రాల జారీతో భూ యజమానులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో సంయుక్త కలెక్టర్ రోణంకి కూర్మానాద్, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ లతో కలిసి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షా పథకానికి చెందిన భూకమత పటాల పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆ పుస్తకాలను పరిశీలించి వాటితో పాటు గ్రామ సర్వేయర్లకు ఉపయోగపడే ఒక బ్యాగు, టోపీ, బూట్లు కల్గిన కిట్లను జిల్లా కలెక్టర్ సర్వే భూ రికార్డుల సహాయ సంచాలకులు హనుమాన్ ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం కింద తొలి దశలో 30 మండలాల్లోని 68 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా భూముల రీ సర్వే కార్యక్రమం పూర్తిచేసి భూకమతాల పటాల పుస్తకాలను రూపొందించడం జరిగిందన్నారు. వాటిని ఆయా గ్రామాలకు సంబంధించిన మండలాల తహసిల్దార్లకు జాగ్రత్తగా చేరవేయాలన్నారు. ఇకపై గ్రామాల్లో ఎక్కడి కక్కడ గ్రామ సచివాలయాల పరిధిలోనే పారదర్శకంగా భూముల రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందన్నారు. దీంతో భూ యజమానులకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇటువంటి రీ సర్వే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
