నెల్లూరు కోర్టులో చోరీ కేసు : సిబిఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు

Clock Of Nellore ( Amaravathi & Nellore ) – రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీనా నెల్లూరులోని జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉన్న 4వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు రికార్డు రూంలో జరిగిన దొంగతనం కేసును సిబిఐకి అప్పగిస్తూ గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.కే. మిశ్రా సంచలన నిర్ణయం ప్రకటించారు. కేసు వివరాల్లో కెళ్తే… తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయని 2017వ సంవత్సరంలో ప్రస్తుతం వ్యవసాయశాఖ మంత్రి గా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆరోపణల సమయంలో కొన్ని డాక్యుమెంట్లను మీడియాకు చూపించారు. అప్పుడు మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా ఎదుట ప్రదర్శించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని అవి నకిలీవిగా తేల్చారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్ఠించారనే అభియోగాలపై కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటూ మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. కాాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ కేసు నెల్లూరు నుండి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. కేసు విచారణ చివరి దశకు చేరుకుంది కూడా.

అదే సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన నాలుగు రోజుల తర్వాత అంటే ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీనా నెల్లూరులోని 4వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు రికార్డు రూములో దొంగతనం జరిగింది. సరిగ్గా సోమిరెడ్డి వర్సెస్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంభందించిన సాక్ష్యాలు, ఇతర ఆధారాలు, పలు దస్త్రాలు, సెల్ ఫోన్లు, సిమ్ కార్డులతో కూడిన బ్యాగును దొంగలు అపహరించారు. బ్యాగులోని కొన్ని వస్తువులు, దస్త్రాలను కోర్టు బయట చెల్లా చెదురుగా పడేశారు. కొన్నింటిని ఎత్తుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చోరీ కేసు దుమారం రేపింది. జిల్లా ఎస్పీ విజయరావు స్వయంగా కోర్టు వద్దకు చేరుకుని చోరీని పరిశీలించారు. దీనిపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత జిల్లా ఎస్పీ విజయరావు విలేకరుల సమావేశం నిర్వహించి కోర్టు చోరీ కేసులో ఇద్దర్నీ అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఇద్దరూ ఇనుపు తక్కు దొంగిలించే వారని చెప్పారు. ఉద్దేశ్య పూర్వకంగా చోరీకి పాల్పడలేదని ఎస్పీ స్పష్టం చేశారు. కోర్టు వెనుక వైపు ఇనుము ఉందని తెలుసుకున్న ఇద్దరు చిల్లర దొంగలు… ఆ రాత్రి కోర్టు వెనుక వైపుకు వెళ్లారని చెప్పారు. అయితే వీరిని గమనించిన కుక్క అరవడంతో ఎవరైనా చూస్తారన్న భయంలో 4వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు వద్దకు వెళ్లారన్నారు. తలుపులు వేసి ఉండగా లోపల ఏమైనా ఉంటాయోమోనన్న ఉద్దేశ్యంతో తలుపును పగులకొట్టి లోపలికెళ్లారన్నారు. అక్కడ బ్యాగు కనిపించడంతో దాన్ని తీసుకుని, బయటకొచ్చి బ్యాగ్ ను చెక్ చేశారని ఎస్పీ తెలియజేశారు. అయితే బ్యాగులో వారికి పనికొచ్చే వస్తువులు లేకపోవడంతో అక్కడే పడేసి వెళ్లారని అప్పటి మీడియా సమావేశంలో ఎస్పీ విజయరావు తెలియజేశారు.

అయితే ఈ చోరీపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు అప్పటి జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చోరీపై నివేదికను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. చోరీ కేసుకు సంభందించిన పోలీసులు నిర్వహించిన దర్యాప్తు విధానంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తులో భాగంగా డాగ్ స్క్వాడ్ తనిఖీ చేపట్టలేదని, తలుపుపై నిందితుల వేలి ముద్రలు సేకరించలేదని, పాదముద్రలు కూడా తీసుకోలలేదన్నారు. కేసు దర్యాప్తును సరైన రీతిలో నిర్వహించలేదని అనుమానాలు వ్యక్తం చేస్తూ, కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన నివేదికలలో పేర్కొన్నారు. ఈ నివేదికను సుమోటాగా తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దానిపై విచారణ చేపట్టారు. కేసును సిబిఐకి అప్పగిస్తామని అడ్వకేట్ జనరల్ కు చెప్పగా ప్రభుత్వం తరపున తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీనిపై గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ప్రకటించారు. నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసును సిబిఐ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయాన్ని ప్రకటిస్తూ దానికి సంభందించిన ఉత్తర్వులను జారీ చేశారు.

Read Previous

దళితుల అభ్యన్నతికి సిఎం జగన్ శక్తి వంచన లేని కృషి : వెల్లడించిన ఎస్సీ కమిషన్ సభ్యులు

Read Next

సిబిఐ విచారణను త్వరితగతి పూర్తి చేయండి : తన అభిప్రాయమూ తీసుకోవాలన్న సోమిరెడ్డి

Leave a Reply

Your email address will not be published.