Clock Of Nellore ( Nellore ) – గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, తమ ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరం ఎలా ఉందో మార్చి తర్వాత నాడు – నేడు చూపిస్తానని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని 44వ డివిజన్ కలెక్టరేట్ సమీపంలో నూతనంగా నిర్మించిన అర్భన్ హెల్త్ సెంటర్ గురువారం ఆయన కమిషనర్ హరితతో కలిసి ప్రారంభించారు. అనంతరం అనీల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మొత్తం 7 అర్భన్ హెల్త్ సెంటర్లను నిర్మిస్తున్నామని ఇప్పటికే 4 సెంటర్లు ప్రారంభించామన్నారు. మిగిలిన మూడు సెంటర్లు ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామన్నారు. ఈ అర్భన్ హెల్త్ సెంటర్లలో సాధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటూ మందులను కూడా ఉచితంగా అందజేస్తారని చెప్పారు.

నెల్లూరులో తానేమీ అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్న కొందరికి అభివృద్ధి కనపడటం లేదా అని నెల్లూరు సిటీ టిడిపి ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనను లక్ష్యంగా చేసుకున్న కొందరు వ్యక్తుల వద్ద రెండేసి లక్షల చొప్పున ప్యాకేజీ తీసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు తన తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నాయని, వాటి ద్వారానే ప్రస్తుతం బ్రతుకుతున్నానని, ఆయనేం వ్యాపారం చేసి బ్రతుకుతున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. బ్రతికేందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్యాకేజీలు తీసుకుని తనపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. తనను తిట్టడం ద్వారా ఓ కుటుంబం బ్రతుకుతుందంటే తనకు సంతోషమేనన్నారు. ప్యాకేజీ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటే ఇంకా ఎక్కువ తిట్టుకోవచ్చని తానేమీ పట్టించుకోనని సూచించారు. వైసీపి అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి నెల్లూరు చరిత్రలో నిలిచిపోయే పనులు చేశానని, మీరేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మీరేం చేశారో… మేమేం చేశామో… మార్చి తర్వాత నాడు – నేడు కార్యక్రమం పెట్టి మరీ వివరిస్తానని అనీల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. రామలింగాపురం ఫ్లై ఓవర్, సర్వేపల్లి కాలువ ఆధునీకరణ, నెల్లూరు బ్యారేజీలు కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ నీలి రాఘవ రావు తదితరులు పాల్గొన్నారు.
