Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పేద ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా “పట్టణ ఆరోగ్య కేంద్రాల” నిర్మాణం జరుగుతోందని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. స్థానిక మూలాపేట, ఈ.ఎస్.ఆర్.ఎమ్ పాఠశాల, కొండ దిబ్బ సమీపంలో నూతనంగా 1.45 కోట్ల రూపాయలతో నగర పాలక సంస్థ నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని కొన్ని వ్యాధులను సైతం పధకంలో చేర్చి పేదలందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. సాధారణ పరీక్షలతో పాటు అవసరమైన అన్ని మందులను ఉచితంగా అందజేసి ప్రజలపై ఆర్ధిక భారం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. వయో వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న చిన్నారులు స్థానిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అనుభవజ్ఞులైన వైద్యులతో వైద్య సహాయం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్కను నాటి సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ హరిత, జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య, నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు రామకృష్ణ, వేలూరు మహేష్, గుంజి లక్ష్మి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, ఊటుకూరు నాగార్జున, నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, చాట్ల నరసింహ రావు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
