Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో వరుస నేరాలు జరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న నేపద్యంలో ఎస్పీ విజయరావు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకూ ఫ్లెండ్లీ పోలీసింగ్ పేరుతో మంచి చెప్పారు ఎస్పీ. మేము మారము… మా నేరాలు ఆగవు అనే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారని గ్రహించిన ఎస్పీ.. శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు తనలో ఉన్న నాలుగో సింహాన్ని బయటకు రప్పించారు. నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్లకు గత వారం రోజుల నుండి స్పెషల్ ట్రీట్ మెంట్ పేరుతో బంభోళ జంభ చూపిస్తున్నారట. జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, అనుమానితులను నెల్లూరు నగరు శివారులోని పోలీసు శిక్షణ కేంద్రానికి రప్పించి స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారట. ఇటీవల నేరాలు, ఇతర అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడ్డ వారిని స్పెషల్ ఫ్లైట్ కూడా ఎక్కిస్తున్నారట. ఎన్ని సార్లు చెప్పినా మాట వినని 9 మంది రౌడీ షీటర్లపై పీడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. కలెక్టర్ సంతకం కాగానే వారిని నెల్లూరులోని సెంట్రల్ జైలుకు పంపనున్నారు. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయరావు హెచ్చరిస్తున్నారు. పీడి యాక్టులు నమోదు చేస్తామని, అవసరమైతే జిల్లా బహిష్కరణ కూడా చేస్తామన్నారు. మరో 9 మంది రౌడీ షీటర్లపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు రంగం సిద్దం అయినట్లు సమాచారం.