Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లా పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం కేసులో సమగ్ర నివేదికను సివిల్ సప్లయిస్ కమిషనర్, ఎండీలతో పాటు కలెక్టర్ చక్రధర్ బాబుకు జేసి అందజేశారు. జేసీ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ ఆడిట్లో భాగంగా గత నెలలో అధికారుల బృందం సివిల్ సప్లయిస్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. ఆ క్రమంలో ఆదాయపు పన్నుకు సంబంధించిన ఓ నకిలీ చలానాను ఆడిట్ సిబ్బంది గుర్తించారు. కార్యాలయానికి సంబంధించిన కొన్ని రికార్డులు. కావాలని కోరారు. దానికి సంస్థ సిబ్బంది సక్రమంగా స్పందించకపోవడంతో పాటు అరకొరగా ఇచ్చిన దస్త్రాల్లోనూ సమాచారం ఆసంపూర్తిగా ఉండటాన్ని గుర్తించారు. అదే సమయంలో జిల్లాకు వచ్చిన కమిషనర్ అరుణ్ కుమార్, ఎండీ వీరపాండ్యన్ దృష్టికి తీసుకువెళ్లడంతో తనను విచారణ జరపాలని ఆదేశించినట్లు జేసి తెలిపారు.
అరకొర సమాధానం… అసంపూర్తి దస్త్రాలు !
“ఆడిట్ సిబ్బంది అడిగిన వాటికి అరకొర సమాధానం చెప్పడం.. అసంపూర్తిగా ఉన్న దస్త్రాలు ఇవ్వకపోవడంతో విషయం వెలుగు చూసింది. కార్యాలయ సిబ్బంది సహకరించకపోవడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వెంటనే కార్యాలయంలో అందుబాటులో ఉన్న రికార్డులు, దస్త్రాలను స్వాధీనం చేసుకున్నాం. తొలుత 2020 – 2021 సంవత్సరానికి సంబంధించిన రికార్డులు పరిశీలించినప్పుడు అక్రమాలు జరిగినట్లు గుర్తించాం. వెంటనే 2021-2022కు సంబంధించి అప్పటి వరకూ జరిగిన లావాదేవీలను తనిఖీ చేశాం. జిల్లా మేనేజర్ ఖాతాలోని డబ్బు పక్కదారి పట్టినట్లు తేలింది. మొదట ఒక ఏడాది వెనక్కి వెళ్లి పరిశీలించాం. అలా వెళుతూ.. 2016-17 వరకు దస్త్రాలను జల్లెడ పట్టాం. అప్పటి నుంచే ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నట్లు నిర్ధారించుకున్నాం. నగదు లావాదేవీలు మొత్తం లేయర్ల వారీగా జరిగింది. డీఎం బ్యాంకు ఖాతా నుంచి ఒక ఖాతాకు అక్కడి నుంచి మరో ఖాతాకు ఆలా రెండు, మూడు ఖాతాల్లో జమ చేసిన తర్వాత విత్ డ్రా చేసినట్లు గుర్తించాం’ అని జేసీ తెలిపారు.
కాజేసింది ఎవరికివ్వాల్సిందో !
సంస్థ ఖాతాలోని రూ.40 కోట్లు పక్క దారి పట్టడంలో.. ప్రభుత్వ అధికారులదే కీలకపాత్ర అని అధికారులు తేల్చారు. మొత్తం 8 మంది ప్రభుత్వ అధికారులు ఉండగా మిగిలిన 24 మందిలో పొరుగుసేవల సిబ్బంది, బయట వ్యక్తులు ఉన్నారు. వీరిలో 11 మందిపై ఇప్పటికే వేదాయపాళెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. మరో వైపు పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వివిధ పద్దుల నుంచి ఎంత నగదు వచ్చింది ? దాన్ని ఎవరెవరికి ఇచ్చారు అనే వివరాలేమీ కార్యాలయంలో అందుబాటులో లేవు. రవాణా, ధాన్యం కొనుగోలు, హమాలీ ఛార్జీలు, అద్దెలు, స్టేజ్ 1, స్టేజ్ 2 ఇలా 30 ఖాతాల నుంచి డీఎం సివిల్ సప్లయిస్ ఖాతాకు ఏడాదికి రూ. 250 కోట్ల వరకు వస్తాయి. అలా వచ్చిన దానిలో ఏ సొమ్మును కాజేశారో అధికారులకు అర్థం కావడం లేదు. రికార్డుల్లో చెక్కులు రద్దు చేసినట్టు నమోదు చేసి వాటిని నగదుగా మార్చుకున్నట్లు గుర్తించారు. అక్రమంగా కాజేసిన సొమ్ముతో కొనుగోలు చేసినట్లు గురించిన ఆస్తులను నిషేదిత జాబితాలోకి చేర్చారు. ఎలాంటి క్రయ విక్రయాలు జరగకుండా జిల్లా రిజిస్ట్రార్ కు లేఖ రాశారు.
మొదలైన అరెస్టుల పర్వం !
జిల్లా పౌర సరఫరాల సంస్థ కుంభకోణంలో ముగ్గురిని వేదాయపాళెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శివకుమార్ తో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. జిల్లా అధికారుల ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంలో 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఎస్పీ విజయరావు అధ్వర్యంలో విచారణకు అదనపు ఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. ఈ క్రమంలో శివకుమార్ తో పాటు పవన్, రాజు అనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దుర్వినియోగమైన నిధుల రికవరి నిమిత్తం ఈ కేసును సిఐడికి అప్పగించనున్నట్లు తెలిసింది. ఆ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.