Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అర్హత ఉండి పథకాలు అందకుంటే తనకు తెలియజేయాలన్నారు. నెల్లూరులోని 27వ డివిజన్ గాయత్రి నగర్ లో ఆయన శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రజలకు ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అంతే కాకుండా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా వైసీపి ప్రభుత్వం పనిచేస్తుందని మీ ఆశీస్సులు వైసీపికి ఉండాలని ఈ సందర్భంగా కోటంరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మురహరి, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
