ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు : మాజీ మంత్రి అనీల్ కుమార్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీలో తాను చేస్తున్న అభివృద్ధి మూడేళ్ల తర్వాత కనిపిస్తుందని గతంలో తాను చెప్పిన సత్యం నేడు కళ్లారా కనిపిస్తుందని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో గుర్రాల మడుగు సంఘం వద్ద 3.96 కోట్లతో కృష్ణపట్నం కాలువకు ఇరువైపులా నిర్మించిన రీటైనింగ్ వాల్స్ ను ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి అనీల్ కుమార్ యాదవ్ గురువారం ప్రారంభించారు.

ప్రారంభోత్సవం అనంతరం అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైసీపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడేళ్ల క్రితం నెల్లూరు నగర అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. అయితే పనులు తుది దశకు వచ్చేందుకు మూడేళ్లు పట్టే అవకాశం ఉందని అప్పుడే తాను చెప్పానన్నారు. తాను చెప్పిన మాదిరిగానే నెల్లూరులో అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుందని వెల్లడించారు. నెల్లూరు బ్యారేజీని పూర్తి చేశామని, సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువ ఆధునీకరణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. రామలింగాపురం ఫ్లై ఓవర్ వంతెన కూడా పూర్తి కావస్తుందని చెప్పారు. ఇవే కాకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ చేయని విధంగా నెల్లూరులో అభివృద్ధి జరుగుతుందని వివరించారు. మినీ బైపాస్ రోడ్డులో సర్వేపల్లి కాలువ పక్కన గ్రీనరీ అభివృద్ధి చేస్తామని అది పూర్తయితే నగరం మరింత సుందరీకరణగా మారుతుందన్నారు.

ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో సిఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నగరంలో 400 కోట్లతో ఇరిగేషన్ కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 3000 కోట్లతో రామాయపట్నం పోర్టు పనులు, 500 కోట్లతో ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. 100 కోట్లతో నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ, జిల్లాలో హైవే పై మూడు బ్రిడ్జిలు రానున్నాయని, తద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో వేయి కోట్ల రూపాయలతో చేపట్టిన డ్రైనేజీ మంచినీటి పథకం పనులు పూర్తి చేయకపోయినా వేయి కోట్ల వడ్డీ భారం నెల్లూరు కార్పొరేషన్ పైన పడిందని బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, కర్తం ప్రతాప్ రెడ్డి, ఊటుకూరు నాగార్జున, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నవంబర్ 7న నెల్లూరులో 1008 మహిళలతో కార్తీక మహా దీపోత్సవం: కోటంరెడ్డి వెల్లడి

Read Next

మెడికవర్ లో క్యాన్సర్ కు అత్యాధునిక చికిత్సలు : అవగాహన ర్యాలీ ప్రారంభించిన కమిషనర్ హరిత

Leave a Reply

Your email address will not be published.