మెడికవర్ లో క్యాన్సర్ కు అత్యాధునిక చికిత్సలు : అవగాహన ర్యాలీ ప్రారంభించిన కమిషనర్ హరిత

Clock Of Nellore ( Nellore ) – మహిళలకు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ప్రియదర్శిని మహిళలు గురువారం సాయంత్రం ” పింక్ లైట్ వాక్ ” ర్యాలీని నిర్వహించారు. నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో బాధ్యతలతో ఎప్పుడూ బిజీగా ఉండే మహిళలు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు అత్యధిక శాతం మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడి మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన బాడీ స్క్రీనింగ్ తదితర పరీక్షలను సంవత్సరానికి ఒక్కసారైనా చేయించుకుని క్యాన్సర్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కోసం గతంలో దూర ప్రాంతాలైన చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు మన నెల్లూరులోనే అందరికీ అందుబాటులో “మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్” ఉండడం శుభ పరిణామం అన్నారు. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగించేందుకు ఇలాంటి అవగాహన ర్యాలీలు చేపట్టిన నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు.

కార్యక్రమంలో భాగంగా మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రియ మాట్లాడుతూ పూర్వంతో పోల్చితే నేడు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నవారు అధికమయ్యారని అన్నారు. పట్టణ మరియు గ్రామీణ భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, భారతదేశంలో సగటున 20 మంది మహిళల్లో ఒకరికి వారి జీవిత కాలంలో రొమ్ము క్యాన్సర్ సోకుతుందని చెప్పారు. డిజిటల్ యుగంలో జీవన శైలిలో వేగవంతమైన మార్పుల కారణంగా, భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ఘటనలు పెరుగుతున్నాయని, రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి అనేక కారణాలు దోహదపడతాయన్నారు. నేటి ఆధునిక యుగంలో సరైన జీవనశైలి లేకపోవడం మరియు సాధారణంగా వచ్చేవి మరియు వంశ పారంపర్యంగా వచ్చేవి ఉంటాయన్నారు. అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం మహిళలు 45 సంవత్సరాల వయస్సులో డిజిటల్ మామోగ్రామ్ చేయించుకోవాలని మరియు వార్షిక ( ప్రతి సంవత్సరం ) ఆరోగ్య తనిఖీలలో భాగంగా ఈ రోగనిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని అన్నారు. రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు రొమ్ములో నొప్పి ,రొమ్ముపై చర్మం మసక బారడం, చనుమొనలపై దద్దుర్లు లేదా పుండు, చంకలో లంప్ లేదా నిండుగా ఉండటం వంటి మొదలగునవని ఆమె పేర్కొన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ మాట్లాడుతూ మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో అనుభవజ్ఞులైన ఆంకాలజిస్టులు మరియు సిబ్బంది 24 x 7 అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. క్యాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షలు ముందుగా చేయించుకుని ఏ ఒక్కరు కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలనేదే తమ మెడికవర్ హాస్పిటల్ ఉద్దేశమని తెలియజేశారు. క్యాన్సర్ మహమ్మారి నుండి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలనే తాము పింక్ లైట్ నైట్ వాక్ నిర్వహిస్తు క్యాన్సర్ నివారణకు ముందస్తు సూచనలతో అందరికీ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మరో వైపు ” పింక్ లైట్ వాక్ ” సందర్భంగా నెల్లూరులోని పలు ప్రదేశాలను పింక్ కలర్ విద్యుత్ దీపాలతో అలంకరించారు మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు. ట్రంకురోడ్డులోని గాంధీ విగ్రహం చుట్టూ పింక్ కలర్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అలాగే విఆర్సీ సెంటర్ లోని క్లాక్ టవర్ ను కూడా పింక్ విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. రొమ్ము క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ విద్యుత్ దీపాలంకరణ చేసినట్లు మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు డాక్టర్ రంగరామన్ , డాక్టర్ శ్రీ విద్య , డాక్టర్ ముత్తు, డాక్టర్ అవినాష్, డాక్టర్ శ్రేయాస్, డాక్టర్ ప్రియ, డాక్టర్ సాయి , ప్రియదర్శిని క్లబ్ అధ్యక్షులు సువర్ణ, క్లబ్ సభ్యులు, పి ఆర్ ఓ చందు వర్మ మరియు మెడికవర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు : మాజీ మంత్రి అనీల్ కుమార్

Read Next

మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సేవలు అద్భుతం : కొనియాడిన రోగులు

Leave a Reply

Your email address will not be published.