Clock Of Nellore ( Gudluru ) – నెల్లూరుజిల్లాలోని వివిధ ఆలయాల్లో విగ్రహాలతో పాటూ హుండీలను దోచుకెళ్లే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి వినాయక రాతి విగ్రహాలతో పాటూ పంచలోహ దీపం కుందులు, నగదు, మోటార్ సైకిల్ ను రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే కందుకూరు నియోజకవర్గంలోని లింగ సముద్రం మండలం, బుర్రరెడ్డి పాళెం, వెంగళాపురం గ్రామాలకు చెందిన జయంపు వేణు, జయంపు అంజయ్య, రాపూరి నాగరాజు అనే ముగ్గురు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతుండే వారు. మొత్తం 14 ఆలయాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల విగ్రహాలను, మరి కొన్ని చోట్ల హుండీలను దొంగిలించారు. వీరిపై నిఘా ఉంచిన గుడ్లూరు పోలీసులు గురువారం ఆ ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. దీనిపై గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో కందుకూరు డిఎస్పీ కండె శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. మొత్తం 14 కేసుల్లో నిందుతులుగా ఉన్న ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుండి మొత్తం 90వేలు విలువైన వినాయక రాతి విగ్రహాం, రెండు పంచలోహ దీపం కుందులు, 48వేల నగదు, మోటారు సైకిల్, ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబర్చిన డిఎస్పీ శ్రీనివాసులు, గుడ్లూరు సిఐ సుబ్బారావు, ఎస్సై సుదర్శన్, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.