గణేష్ నిమజ్జన భక్తులకు ప్రసిద్ద ఆలయాల ప్రసాదాలు : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనానికి విచ్చేసే భక్తులకు సుప్రసిద్ధి ఆలయాల ప్రసాదాలను అందిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. గురువారం ఆయన నిమజ్జన ఘాట్ ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోట్ లో ప్రయాణిస్తూ మీడియాతో మాట్లాడారు. ఈనెల 2వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ గణేష్ విగ్రహ నిమజ్జనానికి ఘాట్ వచ్చే భక్తులకు ప్రసిద్ధ ఆలయాల నుండి ప్రసాదం తెప్పించి పంపిణీ చేస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కాణిపాకం వరసిద్ది వినాయకుని దేవస్థానం, కాటంరెడ్డి పట్టాభిరామిరెడ్డి సహకారంతో ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతో అయినవల్లిలో విఘ్నేశ్వర స్వామి దేవస్థానం, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సహకారంతో జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి దేవస్థానం, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహకారంతో గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయం, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సహకారంతో బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అలాగే నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, అయ్యప్ప ఆలయం, శబరి శ్రీరామ క్షేత్రం, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల నుండి కూడా ప్రసాదాలను తెప్పించి భక్తులకు పంపిణీ చేస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా కాశీలోని విశ్వేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారికి అభిషేకించిన గంగా జలాలను కూడా తీసుకొచ్చి భక్తులపై చల్లుతామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాను నిరంతరం ఘాట్ వద్ద ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు.

Read Previous

నెల్లూరు జిల్లాలో విషాదం : ఉరేసుకుని తల్లీ, బిడ్డల బలవన్మరణం

Read Next

గణేశుని సేవలో మేయర్ స్రవంతి దంపతులు…

Leave a Reply

Your email address will not be published.