ప్రణాళిక బద్ధంగా వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు – మంత్రి గోవర్ధన్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ నుంచి జరుపుకోనున్న వినాయక చవితి ఉత్సవాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ప్రణాళిక బద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో గణేష్ చతుర్థి, నిమజ్జన ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఏటా నిమజ్జనం నిర్వహించే పెన్నా నది రంగనాయకుల పేట వద్ద కాకుండా ఈ ఏడాది ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో నెల్లూరు చెరువు ఘాట్ లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పండుగ నిర్వహణలో ఆసక్తి చూపే యువతకు ప్రోత్సాహంగా విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. ఇళ్ల మధ్యలో ఉండే మండపాల వద్ద భారీ సౌండ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా సమీపంలోని బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించుకునేలా అనుమతులు ఇవ్వాలని తెలిపారు. మండపాల వద్ద, నిమజ్జనం ప్రదేశంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఆ శాఖ వారు జాగ్రత్తలు వహించాలని మంత్రి సూచించారు. ఘాట్ రిపేరు పనులు, చెరువులో గుర్రపు డెక్క ఆకు తొలగింపు, రోడ్డు మార్గాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి 4 భారీ క్రేన్ లను వినియోగించాలని, రేపటి నుంచే నిమజ్జన ట్రయల్ రన్ పనులు ప్రారంభించాలని సూచించారు. వినాయక ఉత్సవాల నిర్వహణకు నుడా, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ నిధులను వినియోగించనున్నామని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా నిధులు మంజూరు చేసేలా కోరుతామని తెలిపారు.

నిమజ్జనం ప్రాంతంలో సిసి కెమెరాలు, డ్రోన్ల పర్యవేక్షణ, గజ ఈతగాళ్ళు, బోటులో పహారా, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు బాధ్యతలను సంబంధిత విభాగాలు పర్యవేక్షించాలని గోవర్ధన్ రెడ్డి సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలించే భారీ విగ్రహాల రూట్ మ్యాప్ తయారు చేసుకుని, విగ్రహాలు తరలించే మార్గంలో విద్యుత్, కేబుల్, టెలిఫోన్ తీగల అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతీ మండపం వద్ద పారిశుధ్య నిర్వహణతో పాటు మంచి నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనం జరిగే రోజుల్లో స్వర్ణాల చెరువులో తగినంత నీటిని నిల్వ ఉంచేలా నీటి పారుదల శాఖ అధికారులు జాగ్రత్తలు వహించాలని మంత్రి ఆదేశించారు.

అనంతరం నగర పాలక సంస్థ కమిషనర్ హరిత మాట్లాడుతూ ప్రతీ ఏటా పెన్నా నదిలో జరిగే నిమజ్జన వేదిక మార్పును అందరూ గమనించి సహకరించాలని కోరారు. రాత్రి పూట జరిగే నిమజ్జనాల కోసం నగర పాలక సంస్థ నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి చెరువులో ఎప్పటికప్పుడు పూలు, ఇతర వ్యర్ధాలను తొలగించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా నగర వ్యాప్తంగా ఏర్పాటు అవుతున్న విగ్రహ మండపాల వివరాలు సేకరించి తగిన రూట్ మ్యాప్ త్వరలో సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మేయర్ పొట్లూరి స్రవంతి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకా నాథ్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్, జిల్లా ఎస్పి విజయ రావు, జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, ఆర్డీవో మలోల, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, కార్పొరేషన్ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు సిటీలో పలు అభివృద్ధి పనులు – శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అనీల్

Read Next

మూలాపేట, రంగనాయకులపేటలో ఎమ్మెల్యే అనీల్ పర్యటన

Leave a Reply

Your email address will not be published.