Clock Of Nellore ( Nellore ) – ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను తెలుసుకొని వారి నుండి స్ఫూర్తి పొంది దేశం పట్ల నేటితరం యువత అంకితభావంతో మెలగాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నెల్లూరు నగరంలోని బివి నగర్ లో నివసిస్తున్న స్వాతంత్ర సమరయోధులు స్వర్ణ వేమయ్య కుమారుడు గంగాధర్ నివాసానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేరుకుని తొలుత మహాత్మా గాంధీ, శ్రీ పొట్టి శ్రీరాములు, స్వర్ణ వేమయ్య ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు గంగాధర్ దంపతులను శాలువలుకప్పి పూలమాలలువేసి పుష్పగుచ్చాలు పండ్లు అందజేసి ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను వారికి అందజేసి ఈనెల 15వ తేదీన పోలీస్ కవాతు మైదానంలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని కోరారు. అలాగే స్వర్ణ వేమయ్య కుమార్తెలు డాక్టర్ దేవసేన, డాక్టర్ అరుణకుమారి దంపతులను కూడా జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఘనంగా సత్కరించారు. స్వర్ణ గంగాధర్ కుటుంబ సభ్యుల బాగోగులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం నెల్లూరు నగరంలోని ఏబీఎం కాంపౌండ్ లో నివసిస్తున్న స్వాతంత్ర సమరయోధులు తేరే రాయప్ప కుమారుడు డాక్టర్ ముఖర్జీ నివాసమునకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సంయుక్త కలెక్టర్ కూర్మానాద్ తో కలసి చేరుకుని తొలుత మహాత్మా గాంధీ, శ్రీ పొట్టి శ్రీరాములు, తేరే రాయప్ప ల చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు డాక్టర్ ముఖర్జీ దంపతులను శాలువలుకప్పి పూలమాలలువేసి పుష్పగుచ్చాలు పండ్లు అందజేసి ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను వారికి అందజేసి ఈనెల 15వ తేదీన పోలీస్ కవాతు మైదానంలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని కోరారు. వారి బాగోగులను కుటుంబ సభ్యుల స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ దేశం ఎంతో ప్రగతి సాధించి ముందుకు వెళుతున్నప్పటికీ అందుకు కారణమైన ఆనాటి స్వాతంత్ర సమరయోధులను, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు గురువులు పిల్లలకు స్వాతంత్ర సమరయోధుల గురించి సత్యాగ్రహ పోరాటం, క్విట్ ఇండియా పోరాటం సాయుధ పోరాటం గురించి తెలియ చెప్పాలన్నారు. అటువంటి మహనీయుల జీవిత విశేషాలను తెలుసుకొని వారి నుండి స్ఫూర్తి పొంది నేటి యువతరం దేశం పట్ల అంకితభావంతో ఉండాలన్నారు. మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ దేశం కోసం నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని స్వాతంత్ర సమరయోధుల విశేషాలను తెలిపే విధంగా ఒక మంచి పుస్తకాన్ని రూపొందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు వీలుగా తెలుగు, ఆంగ్లభాషలలో ముద్రిస్తున్నామన్నారు. ఇందుకోసం అవసరమైన విలువైన సమాచారాన్ని గ్రంధాలయాలు, పురావాస్తు శాఖ ద్వారా సేకరిస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న వెలుగులోకి రాని స్వాతంత్ర సమరయోధులను వెలికి తీసి వారి జీవిత విశేషాలు మీద చర్చలు, సదస్సులు గత 15 రోజులుగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

స్వాతంత్రం వచ్చాక కూడా స్వర్ణ వేమయ్య శాసన సభలో4 సార్లు శాసనసభ్యునిగా ఉంటూ హరిజనోద్ధరణకు ఎంతగానో పాటుపడ్డారన్నారు. పూర్వపు జిల్లా కలెక్టర్ ఎస్.ఆర్.శంకరన్ తో కలిసి సి జేఎఫ్ఎస్ భూములు పంపిణీ జరిగేలా కృషి చేశారన్నారు. ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు శ్రమించారన్నారు. బాల్వాడి నిర్వహణ ,తల్లి బిడ్డ ఆరోగ్యం వంటి అప్పట్లో జరిగిన ప్రతి సంస్కరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. వారి ఆశయాలను మనం ముందుకు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో 32 మంది స్వాతంత్ర సమరయోధులను గుర్తించామని ఒక్కొక్కరికి ఒక నోడల్ అధికారిని నియమించి నేరుగా వారి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నందులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. అలాగే విలువైన సమాచారం సమీకరించుటలో కృషి చేసిన విద్యాశాఖ, టూరిజం సాంస్కృతిక శాఖలు, ముఖ్యంగా సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా పౌర సంబంధాల అధికారికి పేరుపేరునా అభినందనలు తెలుపుతున్నానన్నారు. జిల్లా యంత్రాంగం ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధుల కుటుంబీకులందరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

మరో వైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలను నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ హరిత, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీఓలు, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు కలిసి సత్కరించారు.
