80వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట – ప్రభుత్వంపై కేతంరెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పవనన్న ప్రజాబాట పేరుతో నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం 80వ రోజుకు చేరింది. 80వ రోజైన గురువారం ఆయన 40వ డివిజన్ లోని మూలాపేట శివాలయం ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం అధికారులను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని దీవించి, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రాంతం మూలాపేట అని అన్నారు. శివాలయంతో పాటూ వేణుగోపాల స్వామి దేవస్థానం, ధర్మరాజ స్వామి ఆలయం వంటి ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పారు. ఈ దేవాలయాలకు సంభందించిన ఫిక్స్ డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ నగదుతో ఆయా ఆలయాల్లో స్వామి వారికి రోజూ వారీ నిర్వహించే కైంకర్యాలు, ఇతర ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉందన్నారు. అయితే వైసీపి ప్రభుత్వం తాజాగా ఆలయాల ఫిక్స్ డ్ డిపాజిట్ల నగదును వివిధ రూపాల్లో తమ ఖాతాకు మళ్లించుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చర్యల కారణంగా కైంకర్యాలు జరపాలంటే దాతలు, ప్రభుత్వం మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా ఉన్నారని, వారి కోసం గతంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ను వైసీపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వైసీపి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

Read Previous

మార్గం మధ్యలో బస్సు డ్రైవర్ కు అస్వస్థత… ప్రయాణీకులు సురక్షితం

Read Next

ఎంపి విజయసాయిపై చర్యలు తీసుకోండి – నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published.