Clock Of Nellore ( Nellore ) – జగన్ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోవడంతో మధ్య తరగతి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని, మధ్య తరగతి ప్రజల ఆదాయం మూరెడు ఉంటే ధరలు మాత్రం బారేడు ఉన్నాయని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు. పవనన్న ప్రజాబాట ( Pavananna Praja Baata ) కార్యక్రమంలో భాగంగా ఆయన 41వ రోజైన ఆదివారం నెల్లూరు మైపాడురోడ్డులోని సత్యనారాయణ పురం 3వ వీధిలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజలకు పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంకు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని దీవించి పవన్ కళ్యాణ్ ను సిఎంగా చేసుకోవాలన్నారు.
అనంతరం వినోద్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపి ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కుటుంబ ఆదాయానికి నిత్యావసర ధరలకు భారీగా తేడా ఉండటంతో ప్రజలు కష్టాలు పడుతున్నారని చెప్పారు. 41 రోజుల పాటూ తాను గడప గడపకూ వెళ్తున్నానని, ప్రతీ ఒక్కరూ ధరల పెరుగుదలపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఉచిత పథకాల పేరుతో వైసీపి ప్రభుత్వం పంచుతున్న నగదు… తాము తీసుకున్న అప్పులకు సంబంధించి వడ్డీలకు కూడా రావడం లేదని ప్రజలు వాపోతున్నారని కేతంరెడ్డి పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనసేన పార్టీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
