Clock Of Nellore ( Nellore ) – దైనందిన జీవితంలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యువత పెంపొందించుకోవాలని వై.సీ.పీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. నెల్లూరు 12 వ డివిజన్ వావిలేటిపాడు, రామాలయం ఎదురుగా శుక్రవారం ఏర్పాటు చేసిన వీ.యల్.పీ యూత్ వాలీ బాల్ టోర్నమెంట్ పోటీలను మేయర్ స్రవంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వై.సీ.పీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సరదాగా వాలీ బాల్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వాలీ బాల టోర్నమెంట్ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులందరూ క్రీడా స్పూర్తిని కలిగి అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షించారు. గెలిచే విజేతలకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులుగా రాణించాలని సభాముఖంగా కోరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజూ వారి పనులలో చలాకితనం ఉండాలంటే ప్రతిఒక్కరికీ వ్యాయామం అవసరమని, శారీరక శ్రమను అద్భుతంగా అందించే క్రీడలతో శరీరానికి మంచి వ్యాయామం అందుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా క్రీడలను ఆసక్తిగా చేసుకుని ప్రతి రోజూ సాధన చేస్తూ వుంటే ఆకర్షణీయమైన శరీర సౌష్టవంతో పాటు, చక్కటి ఆరోగ్యాన్ని సాధించగలమని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వై.సీ.పీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, వాలీబాల్ టోర్నమెంట్ నిరహకులు రాజేష్, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.
