Clock Of Nellore ( Nellore ) – ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ ఈనెల 23 వ తేదీన జరగనున్న ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో ఓటర్లకు బల్క్ మెసేజుల ద్వారా ప్రచారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ఉప ఎన్నిక నోడల్ అధికారి, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వారి కార్యాలయం తేదీ 14.06.2022 న జారీ చేసిన మెమో నెంబర్ 555/Elec.A/A1/2022-34 ఆదేశాల మేరకు సాధారణ/ఉప ఎన్నికల్లో ఎస్.ఎమ్.ఎస్ సేవలను ప్రచారానికి వాడుకోవడం నిషిద్ధమని తెలిపారు. 21 వ తేదీ సాయంత్రం 6 గంటలనుంచి 23 వ తేదీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు మొత్తం 48 గంటలు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని నోడల్ అధికారి సూచించారు. ఎన్నికల విభాగం కొన్ని మొబైల్ నెంబర్లను ఏర్పాటు చేసి ప్రజలలో ప్రచారం కల్పించనున్నారని, ఎన్నికల ప్రచారం లేదా ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలతో కూడిన మెసేజుల సమాచారాన్ని మొబైల్ నెంబర్లకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్దేశాల మేరకు ఇలాంటి ప్రచారాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి, వారి వెనక ఉన్న అసలు అభ్యర్థులపై ఐ.పి.సి ప్రకారం చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించారని వెల్లడించారు.
అదే విధంగా రాష్ట్రంలోని అన్ని మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్లకు ఎన్నికల నియమావళిని సూచిస్తూ బల్క్ మెసేజుల సేవలను నిషేధించిన ఎన్నికల సమయంలో అందించకుండా ఆదేశాలను జారీ చేస్తున్నామని, ఎన్నికల సమయంలో వినియోగించిన సాధారణ మెసేజుల చార్జీలను కూడా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో జమ చేసేందుకు సమాచారం ఇచ్చేలా నెట్వర్క్ ప్రొవైడర్లకు నిర్దేశాలను ఇస్తున్నామని వివరించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ నిర్దేశాలను ఎన్నికల పరిశీలకులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి బృందాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికలో పాల్గొంటున్న అభ్యర్థులు, వారి ఏజెంట్లకు అందజేయనున్నట్లు ఉప ఎన్నికల నోడల్ అధికారి జాహ్నవి పేర్కొన్నారు.