నెల్లూరు, సంగం బ్యారేజీలను పరిశీలించిన మంత్రి అంబటి – రెండు నెలల్లో పూర్తి చేస్తాం

Clock Of Nellore ( Nellore & Sangam ) – నెల్లూరు పెన్నా బ్యారేజ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసి త్వరలోనే రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ల నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు బ్యారేజిల నిర్మాణ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తిచేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులతో పెన్నా డెల్టా ప్రాంతంలోని రైతాంగానికి నీరు పుష్కలంగా లభించి, పంటలు బాగా పండుతాయన్నారు. వరదల సమయంలో కూడా ఎటువంటి విపత్తులు జరగకుండా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టులను ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనుండడం శుభపరిణామమన్నారు. జలవనరుల శాఖ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనుల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పనులు చివరి దశకు చేరాయన్నారు. ఈ జూన్ లోగా రెండు ప్రాజెక్టులు సంబంధించి మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి, జూలైలో ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ హరి నారాయణ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఇ కృష్ణ మోహన్, ఆర్డీవో కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరుకు జలవనరుల శాఖ మంత్రి అంబటి – స్వాగతం పలికిన నేతలు, అధికారులు

Read Next

నెల్లూరుజిల్లాలో దారుణం… పెళ్లికి నో చెప్పిందని యువతిని కాల్చి చంపిన ప్రేమోన్మాది

Leave a Reply

Your email address will not be published.