
Clock Of Nellore ( Podalakur ) – నెల్లూరుజిల్లాలో విషాదం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి బలైంది. పెళ్లికి ఒప్పుకోవాలని నేరుగా యువతి ఇంటికి వెళ్లి బెదిరించిన ప్రేమోన్మాది ఆమెపై తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత అక్కడి నుండి పరారయ్యి కొద్ది దూరంలోనే తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దారుణం సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే … నెల్లూరుజిల్లా పొదలకూరు మండలం, తాటిపర్తి గ్రామానికి చెందిన ఆళ్లపాటి సురేష్ రెడ్డి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కావ్య రెడ్డి కూడా పూణేలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో పరిచయం ఉంది. కరోనా నేపద్యంలో ఒకటిన్నర సంవత్సరం నుండి ఇద్దరూ ఇంటి నుండే ఉద్యోగం చేస్తున్నారు.
గత 6 నెలలుగా కావ్య రెడ్డిని వివాహం చేసుకునేందుకు సురేష్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని కావ్య రెడ్డికి చెప్పగా ఆమె నిరాకరించినట్లు సమాచారం. తర్వాత కుటుంబసభ్యులను కావ్య ఇంటికి పంపాడు. అయితే కావ్య కుటుంబ సభ్యులు అమ్మాయికి ఇష్టమైతే తమకూ ఇష్టమేనని సమాధానం చెప్పారు. అయితే కావ్య మాత్రం పెళ్లికి నిరాకరించింది. ఈ నేపద్యంలో ఏం జరిగిందో ఏమో గానీ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత కావ్య నివాసానికి వెళ్లాడు. అప్పుడు ఇంట్లో కావ్యతో పాటూ ఆమె చెల్లెలు మాత్రమే ఉంది. చెల్లెలును పక్కకు తోసిన సురేష్ రెడ్డి కావ్యపై తనతో తెచ్చుకున్న గన్ తో ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే కావ్య తప్పించుకోవడంతో మరో రౌండ్ కాల్చాడు. తూటా కణితిలో చొరబడటంతో అక్కడికక్కడే కుప్పకూలింది. గన్ శబ్ధం విన్న స్థానికులు అక్కడకు చేరుకునే లోపు సురేష్ రెడ్డి అక్కడి నుండి పరారయ్యాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కావ్య రెడ్డిని కుటుంబసభ్యులు నెల్లూరు జిజిహెచ్ కు తరలించారు. మార్గం మధ్యలోనే ఆమె మృతి చెందింది. కాల్పుల తర్వాత పరారయిన సురేష్ రెడ్డి 200 మీటర్ల సమీపంలోనే ఓ గోడౌన్ లోకి వెళ్లిపోయాడు. గోడౌన్ లో నుండి తుపాకీ శబ్ధం రావడంతో స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా సురేష్ రెడ్డి గన్ తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల విషయంలో దర్యాప్తు ప్రారంభించారు. గన్ ను పరిశీలించగా దానిపై మేడ్ ఇన్ యుఎస్ఏ అని ముద్రించి ఉంది. సురేష్ రెడ్డికి గన్ ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంపై దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ విజయరావు నెల్లూరులోని జిజిహెచ్ కు చేరుకుని కావ్య మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో కావ్య రెడ్డిని… సురేష్ రెడ్డి వేధించేవాడని, ఫోన్ కు మెసేజ్ లు కూడా పెట్టేవాడన్నారు. గన్ ఎక్కడి నుండి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు.