Clock Of Nellore ( Delhi ) – కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి, నగదు చెల్లింపులతో ముందుగు సాగే వాహనదారులకు ఫాస్టాగ్ ఆగమనంతో సమయాభావం తప్పింది. టోల్‌ప్లాజాల వద్ద బారులు తీరే పరిస్థితి దూరమైంది. అయితే.. ఫాస్టాగ్ విధానం త్వరలో కనుమరుగు కానుంది. దాని స్థానంలో ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్ప టికే ఐరోపా దేశాల్లో ఉపగ్రహ ఆధారిత గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం( జీ.ఎన్.ఎస్.ఎస్ ) అందుబాటులో ఉంది.
ఈ వ్యవస్థ వల్ల వాహనదారులకూ వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం టోల్‌ప్లాజాల వద్ద సంబంధిత నిర్వహణ సంస్థ టోల్ రోడ్ ప్రారంభం నుంచి ముగింపు దాకా కిలోమీటర్లను లెక్కగట్టి ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు. అంటే.. వాహనదారులు టోల్ రోడ్‌ను 10 కిలోమీటర్లే వినియోగించుకున్నా మొత్తం ట్యాక్స్ చెల్లిస్తున్నారు. జీపీఎస్ ఆధారంగా పనిచేసే జీ.ఎన్.ఎస్.ఎస్ లో వాహనదారుడు టోల్ రోడ్‌పై ప్రయాణించిన దూరానికే టోల్‌ట్యాక్స్ చెల్లించాలి. టోల్ రోడ్డుపై తక్కువ దూరం ప్రయాణిస్తే తక్కువ ట్యాక్స్.. ఎంత ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఎక్కువ టోల్‌ఫీజు ఉంటుందన్నమాట. గత నెల 18న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని పార్లమెంట్లో తెలిపారు.
విదేశాల్లో ఇదే పద్ధతి…
ఐరోపా దేశాల్లో జీ.ఎన్.ఎస్.ఎస్ విధానం అమలవుతోంది. జర్మనీలో 98.8 లక్షల వాహనాలు ఈ వ్యవస్థ పరిధిలో ఉన్నాయి. జీ.ఎన్.ఎస్.ఎస్ పరికరం ఉన్న వాహనం టోల్ రోడ్డుపైకి రాగానే ప్రయాణ టైమ్-లైన్ ప్రారంభమవుతుంది. ఆ వాహనం టోల్ రోడ్డు నుంచి దిగాక లేదా టోల్ రోడ్డు ముగిశాక టైమ్-లైన్ పూర్తవుతుంది. ప్రయాణించిన కిలోమీటర్ల లెక్కన వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి టోల్‌ట్యాక్స్ బదిలీ అవుతుంది.