Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ( Nellore ACB ) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసిబి డిఎస్పీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్న పోలీసు బృందం ఆరోగ్య విభాగంలోని అన్నీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్సుల మంజూరులో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని సమాచారం అందుకున్న ఏసిబి అధికారులు దానికి సంభందించిన రికార్డును పరిశీలిస్తున్నారు. నెల్లూరు నగరంలో అధికారికంగా ఉన్న ట్రేడ్ లైసెన్సుల కంటే అనధికారికంగా మంజూరు చేసిన ట్రేడ్ లైసెన్సులే అధికంగా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల సంభవించిన వరదల్లో బాధితులకు అందించిన భోజన సదుపాయాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తనిఖీల అనంతరం డిఎస్పీ వెల్లడించాల్సి ఉంది. గతంలో పనిచేసిన హెల్త్ ఆఫీసర్ నిర్వాకమే ఈ మొత్తానికి కారణమని ప్రచారం జరుగుతోంది.