Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో సహకార వ్యవస్థ ద్వారా రైతులకు సంపూర్ణంగా సేవలు అందించాలనే లక్ష్యంతో అన్ని సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో కంప్యూటరీకరణ సేవలను మంత్రి కాకాణి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులకు మెరుగైన సేవలు సులభంగా అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాంకును కంప్యూటరీకరించి ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ప్రైవేట్ బ్యాంకులు తమ లాభాల కోసం పనిచేస్తాయని, సహకార బ్యాంకులు రైతుల అభివృద్ధి కోసం పనిచేస్తాయన్నారు. సహకార బ్యాంకుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని, ఈ క్రమంలోనే నెల్లూరు సహకార బ్యాంకుకు షేర్ క్యాపిటల్ గా ఇదివరకే రూ. 73 కోట్లను మంజూరు చేశారని చెప్పారు.

2014 నుంచి 2019 వరకూ నష్టాల బాటలో ఉన్న సహకార బ్యాంకులు నేడు లాభాల బాటలో పయస్తున్నాయని, 2019లో నెల్లూరు సహకార బ్యాంకు షేర్ కాపిటల్ సుమారు రూ. 79 కోట్లు కాగా 2022 లో షేర్ కాపిటల్ రూ. 148 కోట్లకు చేరిందని, డిపాజిట్లు 2019లో రూ. 260 కోట్లు కాగా ప్రస్తుతం రూ. 396 కోట్లకు చేరాయని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 81 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పటిష్ఠం చేస్తామన్నారు. వచ్చే నెలలో మెగా మేళా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో 3500 ట్రాక్టర్లు రైతులకు మంజూరు చేస్తామని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు ట్రాక్టర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ముందుగా నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి బ్యాంకు కార్యకలాపాలను క్లుప్తంగా వివరించారు. మంత్రి హోదాలో తొలిసారిగా బ్యాంకుకు విచ్చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి ముందుగా బ్యాంకు అధికారులు, సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సహకార సంఘాల చైర్మన్లు, బ్యాంకు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, కేంద్ర సహకార బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంకర్ బాబు, నాబార్డు డిడిఎం రవి సింగ్, జిల్లా సహకార అధికారి తిరుపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, సహకార సంఘాల చైర్మన్లు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.