వచ్చే నెల 11 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఆనం సమీక్ష

Clock Of Nellore ( Rapur ) – కరోనా నేపద్యంలో రెండు సంవత్సరాల విరామం అనంతరం జరగబోయే రాపూరు మండలం, పెంచలకోనలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని, అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామ నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మే నెల 11 నుండి 17 వరకు జరుగనున్న దృష్ట్యా , సన్నాహక సమన్వయ సమావేశం నెల్లూరు రెవిన్యూ డివిజనల్ అధికారి పాకల కొండయ్య ఆధ్వర్యంలో శుక్రవారం పెంచలకోన క్షేత్రములోని దేవస్థానం ఆవరణలో జరిగింది.

ఈ సమావేశమునకు అధ్యక్షత వహించిన రామ నారాయణ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆంతరంగికంగా మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్వహించారని, ప్రస్తుతం ప్రజలందరి సమక్షంలో వైభవంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండే కాకుండా కడప జిల్లా నుండి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ముఖ్యంగా13,14 తేదీలలో భక్తులు విరివిగా వచ్చి, రాత్రి నిద్ర చేసి 15వ తేది తిరిగి వెళ్తారని, కావున త్వరితగతిన తమ గమ్యస్థానాలకు చేరేందుకు అధిక బస్సులు నడపాలని సూచించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు శాఖ వారు తగు చర్యలు తీసుకోవాలన్నారు.

ఆయా రోజులలో పవిత్ర పెంచలకోన పరిసర ప్రాంతాలలో మద్యం అమ్మకాలు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. దేవాలయంను విద్యుత్ దీప కాంతులతో అలంకరణ చేస్తున్నందున, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందున భక్తులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా మంచి నీటి వసతి కల్పించాలని కోరారు. కోన పరిసర ప్రాంతాల గ్రామాలలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయుటకు పంచాయితీ అధికారులు కృషి చేయాలన్నారు.

నెల్లూరు ఆర్డీవో కొండయ్య మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. క్యూలైన్లలో ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలని పోలీస్ వారిని కోరారు. దేవాలయ పరిసరాల్లో విరివిగా డస్ట్ బిన్లను ఏర్పాటు చేసి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటసుబ్బయ్య, ఆత్మకూరు డి.ఎస్.పి వెంకటేశ్వరరావు, నెల్లూరు ఆర్టీవో సుశీల, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చెన్ను తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

దొంగతనం నెపంతో గిరిజన బాలుడిపై దాడి… చిల్లకూరులో అమానుషం

Read Next

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం : నెల్లూరుజిల్లాలో 3,52,755 మంది లబ్ధిదారులు

Leave a Reply

Your email address will not be published.