Clock Of Nellore ( Naidupeta ) – నూతనంగా ఏర్పడ్డ తిరుపతి జిల్లాలో అంతర్భాగమైన సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యునిగా ఉంటూ తన పరిధిలోని అంశాల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హామీ ఇచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో స్థానికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి పాల్గొన్నారు. అనంతరం జువ్వలపాళెం రోడ్డులో జరిగిన బహిరంగ సభలో ఎంపి గురుమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో సూళ్లూరుపేట అభివృద్ధికి కంకణ బద్దులై ఉంటామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సూళ్లూరుపేట నియోజకవర్గంలో 36 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని, 12 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, ఇంకా 60 కోట్ల రూపాయల పనులకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. నియోజకవర్గంలో ఒక్క సమస్య కూడా లేకుండా పనిచేయడమే లక్ష్యమని సంజీవయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు ఛైర్మైన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయుడుపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ కటకం దీపిక, సూళ్లూరుపేట మున్సిపల్ ఛైర్మైన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
