ఈనెల 27న ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన… ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పర్యటన ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన నెల్లూరు నగరంలోని ఆకాశవాణి ఎఫ్. ఎం కేంద్రంలో పది కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 100 మీటర్ల టవర్ ను ప్రారంభించే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గురువారం ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసారణ స్టూడియోను, నియంత్రణ కక్ష ఎఫ్ ఎం ప్రసారిణిని, బహుళార్ధ స్టూడియో గదులను , కేంద్రం ప్రాంగణమంతా పరిశీలించారు. అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిందనే విషయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చెన్నై సౌత్ జోన్ ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ రామచంద్రన్ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 21వ తేదీన భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నెల్లూరులో ఆకాశవాణి ఎఫ్.ఎం కేంద్రాన్ని ప్రారంభించారన్నారు.

కేంద్రంలో ఇప్పటివరకు 45 మీటర్ల ఎత్తు ఉన్న టవర్ తో కార్యకలాపాలు నడిచాయని ప్రస్తుతం నూతనంగా 10 కిలోవాట్ శక్తి కలిగిన 100 మీటర్ల ఎత్తున్న టవర్ ను ఏర్పాటు చేశామన్నారు. దీంతో జిల్లా మొత్తం ప్రసారాలు సాధ్యమవుతుందన్నారు. ఈ టవర్ ను ప్రారంభించేందుకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 27వ తేదీన నెల్లూరు నగరానికి రానున్నారని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఆకాశవాణి కేంద్రం టవర్ ప్రారంభించాక, మొక్కలు నాటే కార్యక్రమం, హై టీ కార్యక్రమం, అనంతరం కొందరు పుర ప్రముఖులతో సమావేశమై మాట్లాడతారన్నారు. పొదలకూరు మార్గం నుండి ఆకాశవాణి కేంద్రం వచ్చే దారిలో ఇరువైపులా ముళ్ళ పొదలు ఉన్నాయని వాటిని తొలగించేందుకు సహకరించాలని ఏ డి జీ… జిల్లా కలెక్టర్ ను కోరగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వాటిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సంయుక్త కలెక్టర్ హరెందిర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ జాహ్నవి, ట్రైనీ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, ఆర్ డి ఓ పి. కొండయ్య విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రోగ్రాం డైరెక్టర్ జే. శైలజ రావు, డిప్యూటీ డైరెక్టర్ టి మూర్తి, నెల్లూరు ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ సోమేశ్వర రావు, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ విజయ భాస్కర్, తహసీల్దార్ షఫీ మాలిక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Read Previous

వాలంటీర్లే ప్రభుత్వానికి కళ్లు, చెవులు – వెల్లడించిన మేయర్ స్రవంతి, గిరిధర్ రెడ్డి

Read Next

కందుకూరులో ఎస్పీ విజయరావు… పోలీస్ స్టేషన్ల తనిఖీ

Leave a Reply

Your email address will not be published.