Clock Of Nellore ( Nellore ) – ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు నెరవేర్చుకునేందుకు అనుగుణంగా నెల్లూరు నగర వ్యాప్తంగా అన్ని మసీదు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నామని నగర మేయర్ పొట్లూరి స్రవంతి ( Nellore Mayor Sravanthi ) తెలియజేశారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ దినేష్ కుమార్, నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ తో కలిసి ముస్లిం మత పెద్దలు, నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ ముస్లిం మత పెద్దలతో మాట్లాడి రంజాన్ పండుగ పూర్తయ్యేంత వరకు కార్పొరేషన్ నుంచి అవసరమైన నిర్దిష్ట ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. పవిత్రమైన ఉపవాస దీక్షలను నిర్వహించే ముస్లిం పౌరులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నామని వారు స్పష్టం చేశారు. మసీదుల ప్రాంతాల్లో వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రధాన ప్రాధాన్యత కల్పిస్తూ అవసరమైన చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో రంజాన్ పండుగను పూర్తిస్థాయిలో నిర్వహించలేక పోయామని ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేని కారణంగా అన్ని వసతులను నగర వ్యాప్తంగా కల్పించనున్నామని వారు వెల్లడించారు.
