Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో విదేశీ మద్యంతో పాటూ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం నిల్వలు భారీగా వెలుగుచూస్తున్నాయి. రెండు నెలల క్రితం కృష్ణపట్నం పోర్టు నుండి తీసుకొచ్చిన విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఒకర్ని నెల్లూరు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న గోవా నుండి ఓడల ద్వారా భారీగా నెల్లూరులోని మైపాడు బీచ్ వద్ద మద్యం బాటిళ్లను దిగుమతి చేస్తుండగా పోలీసులు గుర్తించి అనేక మందిని అరెస్ట్ చేశారు. లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బుధవారం నెల్లూరు సుబేదారుపేటలోని అనురాధ స్పోర్ట్స్ ఎదురుగా ఉన్న ఓ ఇంటిలో నెల్లూరు సెబ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పాండిచ్చేరికి చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 10 లక్షల విలువైన 964 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, సంగం గ్రామానికి చెందిన కొండా ప్రవీణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ పోలీసులు తెలియజేశారు.