నూతన బడ్జెట్ తో అభివృద్ధి పనులు వేగవంతం – మేయర్, కమిషనర్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర పాలక సంస్థ నూతనంగా ప్రకటించిన 2022 – 23 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ ( NMC Budget ) కేటాయింపులతో నగర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ దినేష్ కుమార్ లు అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ స్రవంతి అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశంలో ముందుగా నూతనంగా ఎంపికైన కో ఆప్షన్ సభ్యులకు ఆహ్వానం పలికారు. అనంతరం మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సభ్యులంతా నివాళులు అర్పించారు.

సమావేశంలో భాగంగా బడ్జెట్ కేటాయింపులను సభ్యులకు చదివి వినిపించి అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు. సభ్యులంతా ఏకగ్రీవంగా నూతన బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు వివిధ డివిజనుల్లోని స్థానిక సమస్యలను మేయర్ దృష్టికి తీసుకురాగా వాటికి కమిషనర్ స్పందించారు. పన్నుల చెల్లింపులో కొన్ని ప్రాంతాల ప్రజలు సహకరించని సందర్భాల్లోనే స్పెషల్ రెవెన్యూ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగర వ్యాప్తంగా రోడ్లపై సంచరించే పశువులను సేకరించి పశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నామని, పశు సంరక్షణ కేంద్రంలో వాటికి తగిన ఆహార వసతి కల్పించి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నామని పేర్కొన్నారు. పశువులను సేకరించి కేంద్రాలకు తరలించి పరిరక్షించినందుకు కార్పొరేషన్ కు అయిన ఖర్చునే పశు యజమానులకు జరిమానా రూపంలో విధిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు.

( Nellore Muncipal Corporation ) నగరంలోని హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని పందుల పెంపక యజమానులకు విక్రయించడాన్ని సహించబోమని, పందులు విపరీతంగా పెరగడానికి ఇది ప్రధాన కారణమవుతుందని కమిషనర్ తెలిపారు. వీలుంటే ఆహార వ్యర్ధాలను సేంద్రీయ ఎరువులుగా రీసైక్లింగ్ చేసుకోవాలని, లేకుంటే చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే తప్పనిసరిగా అందించాలని కమిషనర్ స్పష్టం చేసారు. నగర వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు ఆర్వో వాటర్ ప్లాంట్లలో అమలుపరుస్తున్న క్వాలిటీ విధానాలను తనిఖీ చేసేందుకు కార్పొరేషన్ నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని, నూతనంగా నిర్మితమవుతున్న కమాండ్ కంట్రోల్ రూమ్ పనులు పూర్తయితే కౌన్సిల్ సమావేశాలకు మాత్రమే ప్రస్తుతమున్న వేదికను వినియోగిస్తామని కమిషనర్ స్పష్టం చేసారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ, స్థానిక సమస్యలపై ఆయా విభాగాల శాఖాధికారులు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజనుల ప్రజాప్రతినిధులు, కో ఆప్షన్ సభ్యులు, కార్పొరేషన్ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

నిన్న గోవా… నేడు పాండిచ్చేరి… నెల్లూరులో పట్టుబడుతున్న మద్యం బాటిళ్లు

Read Next

మ‌రో ఘ‌న‌త సాధించిన అపోలో హాస్పిట‌ల్‌… 75ఏళ్ల వ్యక్తికి విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్‌

Leave a Reply

Your email address will not be published.