Clock Of Nellore ( Rapuru ) – నెల్లూరుజిల్లా రాపూరులోని బాలయోగి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు అదృశ్యం కావడం కలకలం సృష్ఠించింది. గురుకుల పాఠశాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన ఇద్దరు పిల్లలను గుర్తించి క్షేమంగా పాఠశాలకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు పెంచలకోన ఆలయానికి వెళ్లాలని భావించి… తెల్లవారు జామున ఎవ్వరికీ చెప్పకుండా పెంచలకోనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం హాస్టల్ సిబ్బంది ఇద్దరు చిన్నారులు లేకపోవడాన్ని గుర్తించి హాస్టల్ వార్డెన్ కు తెలపగా వారు విచారించారు. తోటి విద్యార్ధులెవరూ తమకు తెలియదని చెప్పడంతో ఆందోళనకు గురైనారు. రాపూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు గాలింపు చేపట్టారు. చివరకు ఇద్దరు పెంచలకోన దేవస్థానంలో ప్రత్యక్షం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వారికి అక్కడి నుండి హాస్టల్ కు తీసుకెళ్లి వార్డెన్ కు అప్పగించారు.