Clock Of Nellore ( TP Gudur ) – నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం, మండపం పంచాయితీలోని ఇసుకదొరువు గ్రామం తరలింపు కార్యక్రమం ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. స్థానికంగా ఉన్న సెంబ్ కార్ప్ థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణలో భాగంగా గ్రామాన్ని తొలగించాల్సి వచ్చింది. గ్రామస్తులకు సమీపంలోని మరో ప్రాంతంలో మొత్తం 94 కుటుంబాలకు సెంబ్ కార్ప్ సంస్థ శివసాయి పునరావాస కాలనీ పేరుతో 94 ఇళ్లను నిర్మించింది. ఇవాళ సెంబ్ కార్ప్ సంస్థ పూర్తి చేసిన ఇళ్లను ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో అధికారులకు అప్పగించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కేంద్రానికి అతి దగ్గర్లో ఉన్న ఇసుక దొరువు గ్రామాన్ని తరలించేందుకు 2014 లో అధికారులతో ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రామ తరలింపు ప్రక్రియ తీవ్ర జాప్యం అయిందన్నారు. తాను దీనిపై ప్రత్యేక దృష్ఠి సారించి అధికారులు, కంపెనీ యాజమాన్యంతో చర్చించి పునరావాస కాలనీని నిర్మింపజేశామని వెల్లడించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీలో నాణ్యతా ప్రమాణాలు పాటించి ఇళ్లు నిర్మించడమే కాకుండా మౌలిక సదుపాయాలు కూడా కల్పించామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు స్థాపించేందుకు స్థానిక ప్రజలు, యాజమాన్యాలకు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్ఠికి తీసుకొస్తే వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చేతుల మీదుగా గ్రామస్తులకు నష్టపరిహార చెక్కులను పంపిణీ చేశారు.
