నెల్లూరులో అట్టహాసంగా ముగిసిన రెవెన్యూ క్రీడలు… కలెక్టర్ పై ప్రసంశలు

Clock Of Nellore ( Nellore ) – ఇకనుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో రెవెన్యూ క్రీడలను అట్టహాసంగా నిర్వహిస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. ఐదు రోజులుగా ఉత్సాహభరితంగా జరిగిన 9వ జిల్లాస్థాయి రెవెన్యూ క్రీడల ముగింపు వేడుకలను ఆదివారం రాత్రి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉల్లాస భరితంగా నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కేరింతలు, ఆనందోత్సాహాలతో రెవెన్యూ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తమ కుటుంబ సభ్యులతో విచ్చేశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు రోజుల పాటు పండుగ వాతావరణంలో ఈ క్రీడా పోటీలు జరిగాయని, చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారుల వరకు క్రీడల్లో పాల్గొని తామంతా ఒకటేనని సంకేతాన్ని ఇస్తూ క్రీడాస్ఫూర్తిని చాటారని అభినందించారు. ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పాత్ర చాలా కీలకమని, ఈ వ్యవస్థలోని ఉద్యోగులందరూ ప్రజల పట్ల మానవతా భావం కలిగి మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు. సచివాలయ ఉద్యోగులకు ఈ క్రీడలతో ఆహ్వానం పలుకుతున్నామని, వీరి ప్రొబేషన్ కూడా త్వరలోనే డిక్లేర్ కానున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో సచివాలయ ఉద్యోగులు మెరుగైన సేవలు అందించి కరోనా కట్టడి లో తమ వంతు కృషి చేశారని అభినందించారు. ఈ క్రీడలు ఉద్యోగులకు క్రమశిక్షణ, నిబద్ధత, గౌరవం కలిగిస్తాయన్నారు. ఉద్యోగులందరూ క్రమం తప్పకుండా క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఐదు రోజులుగా నిర్వహించిన క్రీడల్లో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన రెవెన్యూ ఉద్యోగుల ఆట తీరు ఆశ్చర్యపరిచిందని, ఉత్తమ క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసేందుకు చొరవ చూపాలని డిఆర్వోకు సూచించారు. క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన జిల్లాలోని అన్ని డివిజన్లకు చెందిన క్రికెట్ క్రీడాకారుల్లో 20 మంది ఉత్తమ ఆటగాళ్లను రెవిన్యూ అసోసియేషన్ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్ గా జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ ఐదు రోజుల క్రీడోత్సవాల్లో జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఐదు డివిజన్ల ఆర్డీవోలు అహర్నిశలు శ్రమించి ఈ ఆటల పోటీలను విజయవంతంగా నిర్వహించారని కొనియాడారు.

తొలుత సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు మొదలు కాగా నృత్య ప్రదర్శనలు, గేయాలాపనలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీవోలను రెవిన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచల్ రెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. ఈ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల్లో జాయింట్ కలెక్టర్లు హరేంద్ర ప్రసాద్, రోజ్ మాండ్, డి ఆర్ ఓ, క్రీడల ఆర్గనైజింగ్ కన్వీనర్ చిన్న ఓబులేసు, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్లు సువర్ణమ్మ, సుధాకర్, నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, నాయుడుపేట, కావలి ఆర్డీవోలు హుస్సేన్ సాహెబ్, మురళీకృష్ణ, చైత్ర వర్షిని, సరోజిని, సీనా నాయక్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, చీఫ్ కోచ్ యతిరాజ్, సెట్నల్ సీఈవో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Previous

కాఫీ తాగండి… కప్పు తినండి… నెల్లూరుజిల్లాలో వెరైటీ టీ స్టాల్

Read Next

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో క్లిష్టమైన శస్త్ర చికిత్స విజయవంతం

Leave a Reply

Your email address will not be published.