పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి… ఎస్సీ, ఎస్టీలకు మేయర్ స్రవంతి పిలుపు

Clock Of Nellore ( Nellore ) – బంధనాలు, భయాలు వీడి ధైర్యంగా ముందుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి తోడ్పాటును అందిస్తున్నాయని నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి విజ్ఞప్తి చేశారు. ఏపి దళిత ఎంటర్ ప్రెనర్స్ అండ్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ నిర్వాహకులు నెల్లూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన MSME అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు రాష్ట్ర MSME డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ కరీముల్లా, రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్ డి. ఝాన్సీ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రసాద్, కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ రాజశేఖర్, విశాఖ పట్నం MSME డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ ఇన్వెస్టిగేటర్ డివిఎస్ఆర్ మూర్తి, ఏపి దళిత ఎంటర్ ప్రెనర్స్ అండ్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ రాష్ట్ర కో – ఆర్డినేటర్ పినమల నాగ్ కుమార్, జిల్లా కో – ఆర్డినేటర్ శ్రీహరి ప్రసాద్ పాల్గొన్నారు.

సదస్సులో నగర మేయర్ పోట్లూరి స్రవంతి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా, ఆర్ధికంగా పురోగతి సాధించినప్పుడే దేశం పురోగతిలో ఉన్నట్లు అని అన్నారు. ఎస్సీ, ఎస్టీలను సామాజికంగా, ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు MSME ద్వారా అనే అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. ఉద్యోగాల కోసం వెదుక్కోవడం కాదు… నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నినాదంతో ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దన్నుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. భయాలు, బంధనాలు వీడి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు ఎస్సీ, ఎస్టీలు ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎంఈజిపి, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకాలు అమల్లో ఉన్నాయని వాటిపై పూర్తి అవగాహన చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు ఎస్సీ, ఎస్టీలు ముందుకు రావాలన్నారు.

రాష్ట్ర MSME డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ కరీముల్లా మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేయాలను కునే ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ వర్గాలకు చెందిన ఔత్సాహికులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తుందని చెప్పారు. తమను సంప్రదిస్తే వాటి వివరాలను తెలియజేస్తామన్నారు. పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఎస్సీ, ఎస్టీలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. మొత్తం పెట్టుబడిలో 40 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, స్థలం కావాలనుకునే వారికి ఏపిఐఐసి సగం ధరకే స్థలం కేటాయిస్తుందని, సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అవసరమైన అన్నీ అనుమతులు ఒకే దఫా మంజూరవుతాయని పేర్కొన్నారు. కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఎస్సీ, ఎస్టీలు సరైన ప్రతిపాదనలతో వస్తే వెంటనే రుణాలను మంజూరు చేస్తామని చెప్పారు. పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకునే ఎస్సీ, ఎస్టీలు ఏపి దళిత ఎంటర్ ప్రెనర్స్ అండ్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ నిర్వాహకులను కలిసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చునని, 77805 31919, 94947 06324 నంబర్లకు ఫోన్ చేసి కూడా వివరాలను తెలుసుకోవచ్చునని స్పష్టం చేశారు.

Read Previous

పశ్చిమ గోదావరికి చెందిన యువతి మిస్సింగ్ కేసు… చేధించిన నెల్లూరు పోలీసులు

Read Next

పార్లమెంట్ లో ఎంపి ఆదాల ప్రశ్నలు… కేంద్రం సమాధానాలు..

Leave a Reply

Your email address will not be published.