Clock Of Nellore ( Nellore ) – ఈనెల 8వ తేదీనా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నెల్లూరుజిల్లాలోని మహిళా ప్రజా ప్రతినిధులంతా విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. విజయవాడలో జరిగే వేడుకలకు జిల్లాలోని మహిళా ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ పదవులలో నియమితులైన మహిళలు, స్థానిక సంస్థల్లో ఎన్నికైన మహిళా ప్రతినిధులు హాజరవ్వాలని కోరారు.
ఆర్ధిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాన హక్కులు కల్పిస్తూ మహిళా సాధికారతను సాకారం చేశారని కొనియాడారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయించారని, ఉప ముఖ్యమంత్రి పదవితో పాటూ కీలకమైన హోం మంత్రిత్వ శాఖను సైతం మహిళకే కేటాయించి ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అని నిరూపించుకున్నారని అన్నారు. ఎక్కువ సంక్షేమ పథకాలు కూడా మహిళల పేరుతోనే కేటాయిస్తున్నారని, మహిళల రక్షణ కోసం ఎన్నో విధి విధానాలు రూపొందించారని మహిళలకు అంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి మహిళా దినోత్సవం రోజున కృతజ్ఞతలు తెలియజేస్తామని ఆనం అరుణమ్మ తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఇందుకూరుపేట, రాపూరు, జలదంకి, కోవూరు, అల్లూరు, సంగం, ఆత్మకూరు, గూడూరు, మనుబోలు, డక్కిలి జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.