Clock Of Nellore ( Marripadu ) – రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గౌతమ్ రెడ్డి పార్ధివదేహాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటల మధ్య హైదరాబాద్ నుండి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు హెలికాప్టర్ ద్వారా తరలిస్తారు. అక్కడ నుంచి డైకస్ రోడ్డు లోని మంత్రి నివాసానికి తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. తిరిగి బుధవారం ఉదయం నెల్లూరు నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలోని మేకపాటి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి కి పార్థివ దేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా బ్రాహ్మణపల్లి సమీపంలోని కృష్ణాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్ పి విజయ రావు, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఆత్మకూరు ఆర్డిఓ చైత్ర వర్షిని, ఇతర అధికారులు పరిశీలించారు.
