Clock Of Nellore ( Hydarabad ) – రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) గుండెపోటుతో కన్నుమూశారు.. ఈ రోజు ఉదయం గౌతమ్‌రెడ్డికి గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. గౌతంరెడ్డి 1971లో జన్మించారు. వారం రోజుల పాటు దుబాయ్ ఎక్స్‌పోకు హాజరయ్యారు. నిన్న ఉదయమే హైదరాబాద్ లోని వారి నివాసానికి చేరుకున్నారు.
మేకపాటి గౌతంరెడ్డి నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపి అధికారంలోకి వచ్చాక తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1971 నవంబరు 2 జన్మించిన గౌతంరెడ్డి.. బ్రిటన్‌లో ఎమ్మెస్సీ చదివారు. 2014, 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలుపొందారు. 2019 జూన్ 8న మంత్రిగా గౌతంరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గౌతంరెడ్డిది రాజకీయ కుటుంబ నేపథ్యం.. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాజీ ఎంపీ.
జిమ్‌కు వెళ్దామని సిద్ధమై.. అంతలోనే…
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. కాగా, ఈ ఉదయం 7.30 గంటల సమయంలో గౌతమ్‌రెడ్డి జిమ్‌కు వెళ్దామని సిద్ధమైనట్లు ఆయన ఇంటి కాపలాదారు తెలిపారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు రాకముందే ఛాతీలో నొప్పి అంటూ ఆయన సోఫాలో కూర్చున్నారని చెప్పారు. దీంతో వెంటనే గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి వాహనంలో ఆస్పత్రికి తరలించినట్లు కాపలాదారు వివరించారు. గౌతమ్‌రెడ్డిని ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని.. అప్పటికే ఆయన శ్వాస ఆడట్లేదని అపోలో వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారన్నారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని అపోలో వైద్యులు చెప్పారు.
రెండు రోజులు సంతాప దినాలు…
మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ప్రభుత్వ పూర్తి అధికార లాంఛనాలతో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం గౌతంరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రముఖుల సంతాపం…
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గౌతమ్‌రెడ్డి సౌమ్యులు, సంస్కారవంతులని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, పని పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు అని అన్నారు. గౌతమ్‌రెడ్డి తాత సమయం నుంచి ఆ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందన్నారు. గౌతమ్‌రెడ్డి నేనంటే ఎంతో అభిమానం చూపేవారన్న వెంకయ్యనాయుడు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్‌రెడ్డి అని.. మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనని జగన్ అన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. మేకపాటి భౌతిక కాయానికి నివాళి అర్పించి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు.
మంత్రి మేకపాటి మృతి పట్ల చంద్రబాబు సంతాపం తెలిపారు. మంత్రి మేకపాటి మృతి తనను కలచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరమన్న చంద్రబాబు.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గౌతంరెడ్డి మృతి పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త అమితంగా బాధించిందన్నారు. చిన్న వయస్సులోనే గౌతంరెడ్డి మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరమన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారన్న పెద్దిరెడ్డి… నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. గౌతంరెడ్డి అధ్వర్యంలో రాష్ట్ర పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధించిందన్నారు. మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పెద్దిరెడ్డి… గౌతమ్ రెడ్డి మరణం వైకాపాకు, రాష్ట్రానికి తీరని లోటని తెలిపారు.
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని లోకేశ్ అన్నారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తికి గుండెపోటు రావడం విచారకరమన్నారు. వినయం, విధేయతలు గౌతంరెడ్డి చిరునామా అని లోకేశ్ తెలిపారు. ఐదు పదుల వయస్సులోనే ఎంతో హుందా గల వ్యక్తి గౌతంరెడ్డి అని అన్నారు.